Sri-lanka-Vs-India-Test-Series-Delhi-Pollution---Gangulyఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో డబుల్ సెంచరీకి ఖంగుతిన్న శ్రీలంక జట్టు, రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 131 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. నాటకీయ పరిణామాల నేపధ్యంలో టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్ ను 536/7 పరుగుల వద్ద విరాట్ కోహ్లి డిక్లేర్ చేయాల్సి వచ్చింది.

పొల్యూషన్ వలన తమ బౌలర్స్ బౌలింగ్ చేయలేకపోతున్నారని, అలాగే ఫీల్డింగ్ కు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎంపైర్లతో పదే పదే శ్రీలంక కెప్టెన్ చర్చలు జరుపుతున్న తీరుతో విసుగు చెందిన విరాట్ కోహ్లి, ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తూ… మేము బౌలింగ్ చేయగలం అంటూ శ్రీలంక జట్టుకు సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాదు షమీ వేసిన తొలిబంతికే శ్రీలంక ఓపెనర్ పెవిలియన్ కూడా చేరుకున్నాడు.

అయితే బ్యాటింగ్ కు ముందు వరకు మాస్క్ లు ధరించి ఫీల్డింగ్ చేసిన లంకేయులు, బ్యాటింగ్ లో గానీ, పెవిలియన్ ఎండ్ లో గానీ మాస్క్ లు ధరించకపోవడం విశేషం. ఇదే విషయాన్ని లేవనెత్తిన మాజీ టీమిండియా రధసారధి గంగూలీ శ్రీలంక జట్టు తీరుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. క్రీజులోకి వచ్చిన అయిదుగురు బ్యాట్స్ మెన్లకు తోడు, సిట్టింగ్ లో ఉన్న వారిలో ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదు.

ఇంత తక్కువ సమయంలో ఎంత మార్పు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచిన గంగూలీ మాటల్లోని అంతర్యం తెలియనిది కాదు. ఓ విధంగా శ్రీలంక జట్టు సభ్యులపై సెటైర్లు వేసినట్లే వేసిన గంగూలీ, ఆ జట్టు క్రీడాస్ఫూర్తిని కూడా పరోక్షంగా ప్రశ్నించాడు. టీమిండియాకు ‘దూకుడైన స్వభావాన్ని నేర్పించిన ‘ఆది కెప్టెన్’గా కితాబందుకున్న గంగూలీ వారసత్వాన్ని ప్రస్తుతం విరాట్ కోహ్లి విజయవంతంగా కొనసాగిస్తున్నాడు.