Raja Raja Chora - Sree Vishnuయువ హీరో శ్రీ విష్ణు పై ప్రేక్షకులలో ఒకరకమైన సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఆయన రొమాంటిక్, కామెడీ, కుటుంబ చిత్రాలకు బాగా సూట్ అవుతాడు. చాలా కాలంగా సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్న శ్రీ విష్ణు బ్రోచేవారెవరురా తో హిట్ కొట్టాడు. అయితే ఏమైందో ఏమో గాని వెంటనే రూట్ మార్చి తిప్పరా మీసం అనే మాస్ మూవీ చేశాడు.

అది ఘోరమైన ప్లాప్ గా మారింది. దీనితో ఇప్పుడు మళ్ళీ పంథా మార్చాడు ఈ యువ హీరో. తన తరువాతి సినిమాగా ఒక కామెడీ సబ్జెక్టు ని ఎన్నుకున్నాడు. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’ అనే పేరును నిర్ణయించారు. ‘హసిత్ గోలి’ ఈ చిత్రం ద్వారా దర్శకునిగాపరిచయం అవుతున్నారు. హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోందని, ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యిందని చిత్రబృందం తెలిపింది.

ఏప్రిల్ నాటికి చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి, వేసవి కానుకగా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సునయన ఒక నాయికగా కనిపిసస్తుంది. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాతో శ్రీ విష్ణు మళ్ళీ హిట్ల బాట పెడతాడేమో చూడాలి.