SPYder Vs Jai Lava Kusa“జై లవకుశ” సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ నటన పట్ల సినీ విమర్శకులతో పాటు రాఘవేంద్రరావు వంటి దిగ్గజ వ్యక్తులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. మరో వైపు భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొడుతుందని భావించగా, అది నెరవేరలేదు. జూనియర్ ఎన్టీఆర్ నటనకు కావలసినంత ప్రశంసలు అయితే వస్తున్నాయి గానీ, అవి సినిమాను కమర్షియల్ గా ఒక రేంజ్ లో నిలబెట్టేదిగా ఉండకపోవడం గమనించదగ్గ విషయం.

మొదటి రోజు అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా, రెండవ రోజు కలెక్షన్స్ లో భారీ డ్రాప్ ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక వీకెండ్ అయిన శని, ఆదివారాలలో పరిస్థితి కాస్త మెరుగుగా ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ, అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే బుధవారం నాడు మరో పెద్ద సినిమా ప్రిన్స్ మహేష్ బాబు “స్పైడర్” విడుదలకు ముహూర్తాన్ని ఖరారు చేసుకోవడంతో, ఆ సినిమా ఫలితంపైనే జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” సినిమా కలెక్షన్స్ రేంజ్ ఆధారపడి ఉంటుందన్న విశ్లేషణలు బలంగా వస్తున్నాయి. మొదటి వారంలో రికార్డు స్థాయి కలెక్షన్స్ కాకపోయినా, సేఫ్ జోన్ వసూళ్ళ వైపుకు పరుగులు పెడుతుందని భావిస్తున్నారు.

ఒకవేళ “స్పైడర్” సినిమా గనుక అంచనాలను అందుకోగలిగితే, ‘జై లవకుశ’ సినిమా ఉధృతి మరింత తగ్గే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ‘స్పైడర్’ తర్వాత మరో రెండు రోజుల్లో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ “మహానుభావుడు” కూడా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ‘స్పైడర్’కు పాజిటివ్ టాక్ వస్తే పరిస్థితి ఇలా ఉంటే, ఒకవేళ అంచనాలను అందుకోలేని పక్షంలో మరో ప్రత్యామ్నాయం లేక జూనియర్ ఎన్టీఆర్ “లవకుశ” మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ ఎలా లేకపోయిందో, అలాగే ఫుల్ నెగటివ్ టాక్ కూడా లేదు. దీంతో సినీ ప్రేమికులు తారక్ సినిమాకు పరుగులు పెట్టే అవకాశం ఉంది.