Spyder scenes controversy నేటి వివాదాలే… రేపటి పబ్లిసిటీ… అన్నది రాంగోపాల్ వర్మ మార్క్ ఆలోచనగా చెప్పవచ్చు. అయితే సినిమాల విషయానికి వచ్చేపాటికి ఒక్క వర్మే కాదు, చాలా చిత్రాలకు వివాదాలతో కూడిన పబ్లిసిటీ బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం అలాంటి వివాదమే మురుగదాస్ – మహేష్ బాబుల “స్పైడర్” సినిమాను చుట్టుముట్టింది. ‘నో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్’ యాడ్ కూడా లేనటువంటి ‘స్పైడర్’ సినిమాలో వివాదం ఏముంది? అని ఆలోచిస్తున్నారా? అలంటి వారికే షాక్ ఇచ్చారు కాటికాపర్లు.

రామంతాపూర్ లోని హిందూ శ్మశానవాటికలో ఆదివారం నాడు రాష్ట్ర కాటికాపర్ల సంఘం అధ్యక్షులు శీలం సత్యనారాయణ తదితరులు సమావేశమై… ‘స్పైడర్’ సినిమాలోని సన్నివేశాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. ఎండనక, వాననానక ఎంతో మంది దళితులు నిత్యం శ్రమిస్తుంటే… వారిని కించపరిచే విధంగా “స్పైడర్” సినిమాలో కాటికాపర్లకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా ‘స్పైడర్’ చిత్ర యూనిట్ ను డిమాండ్ చేసారు.

ఒకవేళ సదరు సన్నివేశాలు తొలగించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ‘స్పైడర్’ దర్శకనిర్మాతలను కాటికాపర్ల సంఘం ప్రతినిధులు జంగయ్య, సత్యనారాయణ తదితరులు హెచ్చరించారు. అయితే ఇలాంటి వివాదాలు సర్వసాధారణమే అయినా, కులానికి సంబంధించినవి కావడంతో ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. అయితే ఇది తాటాకు చప్పుడో లేక ‘స్పైడర్’ పాలిట “లక్ష్మీ బాంబు”గా మారుతుందేమో చూడాలి. తెలుగునాట ఈ సినిమా పరిస్థితి మరింత దయనీయంగా మారగా, తమిళనాట మాత్రం కాస్త ఆశాజనకంగానే ఉంది.