mahesh babu spyder-themeసామాజిక అంశాలను తన సినిమా కధలో మిళితం చేసి, వాటిని అందంగా వెండితెరపై ప్రతిబింబించడంలో దర్శకుడు మురుగదాస్ స్పెషాలిటీ అందరికీ తెలిసిందే. మరి అలాంటి మురుగదాస్ టాలీవుడ్ ప్రిన్స్ ను తీసుకుని “స్పైడర్” సినిమా కధన ఎలా సిద్ధం చేసారు? అసలు ఈ సినిమాలో మురుగా ఇవ్వబోతున్న సందేశం ఏమిటి? ఇలా రకరకాల ప్రశ్నలు ప్రిన్స్ అభిమానులను వేధిస్తున్నాయి. వీటికి పూర్తి సమాధానం కావాలంటే మరో రెండు రోజులు వేచిచూడక తప్పదు గానీ, ఈ సినిమా ‘థీమ్’ అయితే పరోక్షంగా దర్శకుడు చెప్పారు.

ఒకటి, రెండు రూపాయలకే వైద్యం చేసి, ఆనందపడే డాక్టర్లను ప్రత్యక్షంగా చూసాను, సామాజిక సేవతో సంతృప్తి పొందేవాళ్ళను చూసాను, వాళ్ళల్లో ఉన్న ‘మానవత్వం’ నాకు నచ్చింది, ఈ కధ రాయడానికి అదో కారణం. ఇప్పుడంతా ఇన్ స్టంట్ కాఫీ, టూ మినిట్స్ లో వండే న్యూడుల్స్, రెడీమేడ్ మసాలాలు, చివరికి దేవుణ్ణి కూడా వేగంగానే ప్రార్ధిస్తున్నారు. రోడ్డు మీద వెళుతూ బయట నుంచే దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. పక్క వాళ్ళ గురించి పట్టించుకునే తీరిక కూడా ఉండడం లేదు.

ఏ విషయంలో అయినా వేగంగా ఉండొచ్చు కానీ, అమ్మ, నాన్న, స్నేహితులు, బంధువులను ప్రేమించలేనంత తీరిక లేకుండా ఉండకూడదు, రాను రాను ‘మానవత్వం’ అనేది తగ్గిపోతోంది, ఫాస్ట్ యుగంలో ఫాస్ట్ గా దూసుకెళ్ళాలి గానీ, ‘మానవత్వం’ను మరిచిపోవద్దని హీరో పాత్ర ద్వారా కమర్షియల్ కోణంలో చెబుతున్నాం. అందరూ సంతోషంగా ఉండాలనుకునే క్యారెక్టర్ లో హీరో కూల్ గా, సీరియస్ గా ఉంటాడు… అంటూ “స్పైడర్” సినిమా కధ “మానవత్వం”తో కూడుకుని ఉన్నదని చెప్పారు మురుగదాస్.