Spyder Movie Teaser TalkSpyder Movie Teaser Talkఅభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘ప్రిన్స్’ పుట్టినరోజు రానే వచ్చింది. ఈ సందర్భంగా విడుదల కావాల్సిన టీజర్ కూడా అభిమానులను అనుకున్న సమయాని కంటే ముందే పలకరించింది. ఈ విషయంలో సంతృప్తి పరిచిన “స్పైడర్” చిత్ర యూనిట్, టీజర్ ను సరిగ్గా కట్ చేయడంలో మాత్రం విఫలమైందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పవచ్చు. ఈ టీజర్ లో ప్రారంభమైన ఎస్.జే.సూర్య డబ్బింగ్ వాయిస్ తో మొదలైన అసంతృప్తి, చివరలో మహేష్ చెప్పిన ‘భయపెట్టడం మాకూ తెలుసు’ అన్న డైలాగ్ తో ముగుస్తుంది.

మహేష్ పుట్టినరోజు వచ్చేసింది… ఏదొకటి కట్ చేసి రిలీజ్ చేసేయాలి… అన్న తాపత్రయమే ఈ టీజర్ లో కనిపించింది తప్ప… పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ‘గ్లిమ్స్’ రూపంలో విడుదల చేసిన తొలి టీజర్ చాలా ఉత్తమంగా ఉందని చెప్పవచ్చు. ఆ టీజర్ లోనేమో పెద్దగా ఏమీ చూపించలేదు అన్న టాక్ వస్తే, ఈ టీజర్ లో ఎక్కువగా చూపించేసారన్న ఫీలింగ్ వస్తుంది. టీజర్ నిండా యాక్షన్ సన్నివేశాలను నింపేసారు గానీ, ఒక్క యాక్షన్ సీన్ కూడా ‘అదిరింది’ అనేలా ఉండకపోవడం నిరుత్సాహకరమైన విషయం.

బహుశా ఇదంతా సిల్వర్ స్క్రీన్ పై చూస్తే అద్భుతంగా ఉండవచ్చు గానీ, దానిని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ టీజర్ లో కట్ చేయలేదన్నది వాస్తవం. అయితే ఈ టీజర్ ద్వారా ఒక్క విషయమైతే చిత్ర యూనిట్ స్పష్టంగా చెప్పగలిగింది… “స్పైడర్” సినిమా అనేది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అన్న సంకేతాలను ప్రేక్షకులలోకి పంపించడంలో విజయవంతమైంది. ఫైనల్ గా చెప్పాలంటే… ఈ టీజర్ వలన ‘స్పైడర్’ సినిమాకు జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పాలి… అది ప్రేక్షకుల పరంగానే కాదు… ట్రేడ్ మార్కెట్ పరంగా కూడా..!