Spyder-Movie-Teaser-Releaseమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న “స్పైడర్” సినిమా వాయిదాల పర్వం మీద, ప్రస్తుతం ఆగష్టులో విడుదలకు ముహూర్తం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజా టాక్ ప్రకారం ఆగష్టు 11వ తేదీన విడుదల చేయాలని భావిస్తుండగా, ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదల కావడంతో, ‘స్పైడర్’ ఫస్ట్ టీజర్ ఎప్పుడు వస్తుందా? అని ప్రిన్స్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే దీనిపై పక్కా సమాచారం లభించింది. ఎప్పుడూ మహేష్ బాబు పాటించే సంప్రదాయమే, ఈ ‘స్పైడర్’ విషయంలోనూ అవలంభించబోతున్నాడని స్పష్టమైంది. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడు, తన కొత్త సినిమాల టీజర్లను విడుదల చేయడం ప్రిన్స్ కు ‘దూకుడు’ నుండి సెంటిమెంట్ గా మారింది. తాజాగా ‘స్పైడర్’ టీజర్ కూడా కృష్ణ జన్మదినోత్సవం అయిన ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్స్ ద్వారా ఈ సినిమా ‘థీమ్’ ప్రేక్షకులకు చేరువ కాకపోవడంతో, ఈ టీజర్ చిత్ర ప్రమోషన్ కు అత్యంత కీలకంగా మారింది. అలాగే ఈ టీజర్ కోసం కోట్ల రూపాయలు వెచ్చించి లండన్ లో ప్రత్యేకంగా కట్ చేయించినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం హైదరాబాద్, యూసఫ్ గూడ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయబోతున్నారు.