తెలుగు చిత్రసీమే కాదు, ఇండియన్ హిస్టరీలోనే కొత్త రికార్డులు సృష్టించిన “బాహుబలి 2” రికార్డులను అందుకోవడం ఏ సినిమాకైనా అసాధ్యంగానే చెప్పవచ్చు. ఇక తెలుగు సెక్షన్ లో అనితర సాధ్యమైన ‘బాహుబలి 2’ను చేరుకోవడం పక్కన పెడితే, కనీసం ఆ రికార్డుల దరిదాపుల్లోకి వెళ్ళినా గొప్పతనం క్రిందే భావించాలి. ఇది ఒక్క సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, యూ ట్యూబ్ మొదలుకుని అన్ని విభాగాలలో సరికొత్త చరిత్రను సృష్టించిన ‘బాహుబలి 2’ను అందుకోవడం అన్నది ఇప్పట్లో జరిగే విషయం కాదు.

అయితే ప్రతి పెద్ద సినిమా వచ్చినపుడల్లా “బాహుబలి 2” ఖచ్చితంగా తెరపైకి వస్తుంది. తాజాగా ‘స్పైడర్’ టీజర్ విడుదల సందర్భంగా కూడా ‘బాహుబలి 2’ అంశం హల్చల్ చేస్తోంది. తెలుగులో ‘బాహుబలి 2’ టీజర్ సృష్టించిన రికార్డులు మినహా అన్నింటిని ‘స్పైడర్’ టీజర్ తుడిచిపెట్టేసింది. తొలి 24 గంటలు గడిచే సమయానికి దాదాపుగా 4.5 మిలియన్ క్లిక్స్ ను అందుకోవడం అనేది తెలుగు సినిమా పరంగా చూస్తే సామాన్యమైన విషయమేమీ కాదు. ‘బాహుబలి 2’ తర్వాత ‘స్పైడర్’కే సాధ్యమైంది.

అయితే దక్షిణాదిలో మాత్రం మరో రెండు టీజర్లు ‘స్పైడర్’ కంటే ముందు వరుసలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన అజిత్ “వివేగం” టీజర్ దాదాపుగా 6 మిలియన్ క్లిక్స్ ను అందుకోగా, సూపర్ స్టార్ రజనీకాంత్ “కబాలి” టీజర్ 5 మిలియన్ క్లిక్స్ అందుకుంది. దీంతో దక్షిణాది పరంగా చూస్తే ‘స్పైడర్’ నాలుగవ స్థానంలో, తెలుగులో రెండవ స్థానంలో నిలిచింది. ‘బాహుబలి 2’ అనేది మినహాయింపు జాబితాలో వేసుకుంటే… ప్రస్తుతానికి ‘స్పైడర్’ టీజర్ దే అగ్రస్థానం.