భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మురుగదాస్ – మహేష్ బాబుల కాంబో “స్పైడర్” సినిమా విడుదలకు ముందు అంతే భారీగా బిజినెస్ చేసింది. అయితే రిలీజ్ తర్వాత పరిస్థితిలో మార్పు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! ప్రిన్స్ అభిమానుల అంచనాలతో పాటు సినీ ప్రేక్షకులను కూడా తీవ్ర నిరుత్సాహపరిచిన “స్పైడర్” సినిమా కలెక్షన్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి.

ఓ పక్కన భారీ డివైడ్ టాక్ తో సినిమా నడుస్తుంటే, మరో పక్కన చిత్ర యూనిట్ 100, 150 కోట్లు అంటూ పోస్టర్లు రిలీజ్ చేయడం అభిమానుల మధ్య భారీ చర్చకు దారి తీసింది. అయితే ఈ పోస్టర్ల గోల ఎలా ఉన్నా, తాజాగా తెలంగాణా ప్రభుత్వం ‘స్పైడర్’ సినిమాపై ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. తెలంగాణా ఏరియాలో విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోలిస్తే… కేవలం 33 శాతం మాత్రమే ధియేటర్లలో వసూలు చేసిందని అధికారికంగా ప్రకటించారు.

దీంతో ‘స్పైడర్’ భారీ నష్టాలను మిగిల్చిందన్న విషయం అధికారికం అయ్యింది. మహేష్ కు మాంచి పట్టున్న ఏరియాలలో ఓవర్సీస్ మరియు నైజాంలు ఉన్నాయి. కానీ ‘స్పైడర్’ ఈ రెండు ఏరియాలలో కూడా పంపిణీదారులకు తీవ్ర నష్టాలను మిగిల్చడం విశేషం. అంటే ఏ స్థాయిలో మురుగదాస్ అభిమానులను నిరుత్సాహపరిచారో ఈ గణాంకాలే చెప్తున్నాయి. అంచనాలు అందుకోలేక ప్లాప్ కావడం అనేది సహజమే. కానీ ‘స్పైడర్’ విషయంలో ఎలాంటి అంచనాలు లేకపోయినా, ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో సక్సెస్ కాలేకపోయింది.