‘తమిళ’ టాప్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన “స్పైడర్” సినిమాకు ప్రేక్షకుల నుండి విభిన్న స్పందనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఒక్కసారి టాక్ విషయాన్ని పక్కన పెడితే, ‘సూపర్ స్టార్’ హోదాలో ఉన్న మహేష్ బాబు సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోవాలి. ట్రేడ్ అంచనాల ప్రకారం అయితే నాన్ – బాహుబలి రికార్డులను కొల్లగొట్టాలి. మరి ‘స్పైడర్’ ఆ రేంజ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుందా? అంటే అదే ట్రేడ్ వర్గాల నుండి ‘నో’ అన్న సమాధానం వ్యక్తమవుతోంది.

టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ ను తీసుకురావడమే ‘స్టార్’ హీరోల స్టేటస్. మరి “స్పైడర్” ఎందుకు విఫలమయ్యాడు? అందులోనూ మురుగదాస్ వంటి టాప్ దర్శకుడితో జతకట్టిన సినిమాకు ఓపెనింగ్ డే నాడు ఎందుకు రికార్డులు సృష్టించలేకపోయారు? అభిమానులు ఆశిస్తున్నట్లుగా ‘స్పైడర్’ విషయంలో నిజంగానే ఒక అంతర్లీన కుట్ర జరిగిందా? ఇదంతా బయటకు రాని విషయాలు గానీ, ‘స్పైడర్’ టీజర్ నుండి విడుదల వరకు జరిగిన పరిణామాలు మాత్రం ‘కుట్ర’ కోణాన్ని బలపరుస్తున్నాయి.

మహేష్ పుట్టినరోజు నాడు విడుదల కావాల్సిన టీజర్, సోషల్ మీడియాలో ముందుగానే లీక్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ట్రైలర్ కూడా ఒక రోజు ముందు నెట్ లో దర్శనమిచ్చింది. వీటన్నింటికి తోడు తొలి 10 నిముషాల సినిమా లీక్ అయ్యిందన్న పుకారు. ఇలా విడుదలకు ముందువరకు లీకేజ్ ద్వారా టార్గెట్ అయిన ‘స్పైడర్’కు ఓపెనింగ్స్ విషయంలో దారుణమైన అన్యాయం జరిగిందన్నది మాత్రం వాస్తవం. పెరిగిన మల్టీప్లెక్స్ ల ప్రకారం ప్రస్తుతం టికెట్ల బుకింగ్స్ ఆన్ లైన్ లోనే ఎక్కువ శాతం జరుగుతున్నాయి.

పెద్ద సినిమాల సందర్భంలో ఆన్ లైన్ బుకింగ్స్ ను ఒక వారం రోజుల ముందుగానే ఓపెన్ చేయడం పరిపాటి. నాడు ‘బాహుబలి 2’ విషయంలోనూ, మొన్నటి ‘జై లవకుశ’ సందర్భంలోనూ ఇలాగే విడుదల సమయానికి ఒక వారం రోజుల ముందుగానే ఆన్ లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దానికి తగ్గట్లే ఆయా సినిమాల టాక్ తో నిమిత్తం లేకుండా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నాయి. మరి ‘స్పైడర్’ విషయంలో ఏం జరిగింది? వారం మాట పక్కన పెడితే, విడుదల సమయానికి కొద్ది గంటల ముందువరకు ఎందుకు ఓపెన్ చేయలేదు?

అవును… సినిమాలే వినోదంగా భావించే విజయవాడ వంటి ‘సినీ అడ్డాలుగా’ మారిన ప్రాంతంలో ఫస్ట్ షో పడడానికి 10 గంటల ముందే ఆన్ లైన్ బుకింగ్స్ ను ఓపెన్ చేసారు. బహుశా చిన్న సినిమాలకు కూడా ఇంత తక్కువ సమయం ఇవ్వరని చెప్పవచ్చు. శుక్రవారం విడుదల కాబోతున్న శర్వానంద్ ‘మహానుభావుడు’ సినిమాకు మూడు రోజుల ముందు నుండే టికెట్స్ ను అందుబాటులో ఉంచారు. ‘స్పైడర్’ సినిమాకు ఇది ఒక్క విజయవాడ ప్రాంతానికే పరిమితం కాలేదు. ఇతర ప్రాంతాలలో కూడా కేవలం ఒక్క రోజు ముందే బుకింగ్స్ ను ప్రారంభించారు.

ఇదంతా ఒక్క “స్పైడర్” సినిమా విషయంలోనే జరిగింది. దీని పర్యవసానం ఏంటో ప్రస్తుతం కనపడుతోంది. ఫస్ట్ షోకు టాక్ విభిన్నంగా రావడం.., ప్రీ బుకింగ్ కు అవకాశం కల్పించకుండా ఉండడం… తదితర పరిణామాలన్నీ ‘స్పైడర్’ రికార్డు ఓపెనింగ్స్ పై ప్రభావితం చూపాయి. ‘టాక్’ అంటే అది అంతిమంగా ప్రేక్షకులు ఇచ్చే తీర్పు గనుక, దానిని ఎంతటి హీరో అయినా స్వీకరించాల్సిందే. కానీ ‘ప్రీ బుకింగ్స్’ విషయంలో ఏ పెద్ద సినిమాకు జరగని విధంగా, ‘స్పైడర్’కు తీవ్ర అన్యాయం జరిగిందన్నది మాత్రం వాస్తవం.

ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందో లేక కాకతాళీయంగా జరిగిందో లేక కుట్ర కోణంలో భాగంగా ‘స్పైడర్’ బలైపోయిందో తేలే విషయం కాదు గానీ, అభిమానులు మాత్రం చిత్ర నిర్మాణ సంస్థ పట్ల గుర్రుగా ఉన్నారనేది సోషల్ మీడియాలో పంచుకుంటున్న అభిప్రాయాల ద్వారా అర్ధమవుతోంది. అయితే ఎంత ‘నెగటివ్’ టాక్ వచ్చినా… జయాపజయాలతో నిమిత్తం లేకుండా తన అభిమానగణాన్ని పెంచుకోవడంలో ‘ప్రిన్స్’ ఎప్పుడూ ‘సక్సెస్’ అవుతూనే ఉన్నాడు… ఈ “స్పైడర్” విషయంలో జరుగుతోంది కూడా అదే..!