Mahesh-Babu-Bharat-Ane-Nenu-Interviewమురుగదాస్ దర్శకత్వంలో తీసిన “స్పైడర్” సినిమాతో తెలుగు నాటే కాకుండా తమిళంలో కూడా దూసుకుపోవోచ్చని ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు అభిమానులు ఎంతో సంబరపడ్డారు. అయితే ఆ ఆశలను మురుగదాస్ ఎంతగా నీరుగార్చారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళం పక్కన పెడితే తెలుగులో అయితే మహేష్ స్టామినానే ప్రశ్నించేలా చేసిన మురుగ ‘స్పైడర్’ అనుభూతులను కొరటాల శివ ‘భరత్ అనే నేను’తో చెరిపివేసారు.

ఇక్కడ ఏ సినిమాతో అయితే ‘స్పైడర్’కు చెక్ పెట్టారో, తమిళంలో కూడా అదే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని తమిళంలో ఈ సినిమాను డబ్ చేసి, ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తెలుగు హీరోలలో మహేష్ బాబుకు తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉన్న మాట నిజమే గానీ, డైరెక్ట్ తమిళ మూవీతో హిట్ అందుకునే అంత ఫాలోయింగ్ ఉందా? అన్నది తేలాల్సిన అంశం.

‘భరత్ అనే నేను’ విషయానికి వస్తే… ‘స్పైడర్’తో పోలిస్తే తమిళంలో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. మురుగదాస్ దర్శకుడు గనుక ‘స్పైడర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ‘భరత్ అనే నేను’ సినిమాకు ప్లస్ పాయింట్. సబ్జెక్ట్ యూనివర్సల్ కావడంతోనే ఈ సినిమాను డబ్ చేసారు, అయితే తెలుగు – తమిళ ప్రేక్షకుల అభిరుచి చాలా సినిమాలలో తేడా కొట్టిన విషయం తెలిసిందే. కనీసం ‘స్పైడర్’ చేదు జ్ఞాపకాలను చెరిపివేసినా చాలు అనుకుంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్.