Mahesh Babu - SPYder Latest News ఈ నెల 27వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న మురుగదాస్ – మహేష్ బాబుల “స్పైడర్” సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడానికి సిద్ధమవుతోంది. నిన్నటి వరకు కూడా ఏదోక ప్యాచ్ వర్క్ ను జరుపుకున్న ఈ సినిమా ‘సెన్సార్’ను సోమవారం (18వ తేదీ) నాడు జరుపుకోనుంది. సినిమాలో ఉన్న యాక్షన్ సన్నివేశాల దృష్ట్యా సెన్సార్ బోర్డు నుండి ‘యు/ఎ’ అందుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సినిమాలో శృంగారం పరంగా ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉండే అవకాశం లేకపోగా, కనీసం ఆల్కహాల్ సీన్ కూడా లేదన్న సమాచారంతో, ‘ఎ’ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం లేదు. అయితే ‘క్లీన్ యు’ ఇస్తారా? లేక యాక్షన్ సన్నివేశాలను దృష్టిలో పెట్టుకుని ‘యు/ఎ’ ఇస్తారో చూడాలి. మహేష్ కు ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువ గనుక, ఈ రెండింటిలో ‘క్లీన్ యు’ లభిస్తే, మల్టీప్లెక్స్ లకు ప్లస్ పాయింట్ అవుతుంది.

అయితే అభిమానుల కోరిక మాత్రం మరోలా ఉంది. ఈ సినిమాకు ఎలాంటి సర్టిఫికేట్ లభించినా పర్లేదు గానీ, స్క్రీన్ పైన ‘ఫర్ మధు సర్’ అని మాత్రం లేకుండా చూసుకోండి అంటున్నారు. ఇప్పటికే అర్ధమైయుంటుంది… దీని ఆంతర్యం ఏమిటో..! లీకైన ధియేటిరికల్ ట్రైలర్ లో ‘ఫర్ మధు సర్’ అని ఉండడంతో, సోషల్ మీడియా వేదికగా ‘స్పైడర్’ చిత్ర యూనిట్ కు కౌంటర్లు ఇచ్చే పనిలో ఉన్నారు ప్రిన్స్ అభిమానగణం.