Mahesh Babu Spyder Censor Talkప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న “స్పైడర్” సినిమా సెన్సార్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ముందుగా అంచనా వేసిన విధంగానే సెన్సార్ బోర్డు నుండి ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా పక్కా యాక్షన్ జోనర్ కనుక, ‘యు/ఎ’ వస్తుందని ట్రేడ్ వర్గాలు ముందుగానే అంచనా వేయగా, కనీసం ఒక్క కట్ కూడా చెప్పకుండా అదే సర్టిఫికేట్ ను సెన్సార్ బోర్డు మంజూరు చేసింది. అయితే ‘స్పైడర్’ సెన్సార్ విషయంలో మరో విశేషం కూడా ఉంది.

ఈ సినిమాలో పొగ త్రాగే సన్నివేశం గానీ, మద్యపానం సేవించే సన్నివేశం గానీ ఒక్కటి కూడా లేనందున, ముందుగా ‘వార్నింగ్’ ఇచ్చే సందేశం ఈ ‘స్పైడర్’ చిత్రంలో ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ‘సెన్సార్’ ముగియడంతో ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఇలా ‘సెన్సార్’ ముగిసిందో లేదో, అలా సోషల్ మీడియాలో ‘స్పైడర్ సెన్సార్ టాక్’ అంటూ హల్చల్ చేయడం ప్రారంభమైంది. ఇందులో ఎంత వాస్తవం ఉందన్నది పక్కన పెడితే.., ‘సెన్సార్’ సర్టిఫికేట్ జారీ అయిన మరుక్షణమే, ఈ ‘సెన్సార్ టాక్’ల ఉధృతి ఒక్కసారిగా పురుడు పోసుకుంటోంది.

‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ సినిమాలో చూపించిన విధంగా… ‘ప్రీ లోడెడ్’ సందేశాలు పెట్టుకుని ఉంటారేమో గానీ, ఈ ‘సెన్సార్ టాక్’లు అభిమానులను, ప్రేక్షకులను పక్కదోవ పట్టించే విధంగా మారుతున్నాయి. ఇందులో ‘పాజిటివ్’గా ఉండే సందేశాలు ఉంటాయి, అలాగే ‘నెగటివ్’ భావాలు వ్యక్తపరిచేవి ఉంటాయి. ‘స్పైడర్’ సినిమా ఆద్యంతం ‘డల్’ మూమెంట్ లేకుండా, రేసీ స్క్రీన్ ప్లేతో వెళ్ళిపోతుందని ఒకరంటుంటే, అసలు ‘స్పైడర్’ సెన్సార్ జరగలేదు, టెక్నికల్ కారణాల వలన ఆగిపోయింది… అంటూ సందేశం పెట్టేవారు మరికొందరు. పెరిగిన సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇలాంటివి విపరీతంగా షేర్ అవుతూ ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తున్నాయి.