Mahesh Babu - SPYder Latest Newsప్రస్తుతం సినిమాల ప్రమోషన్స్ ఎక్కువ శాతం సోషల్ మీడియా కేంద్రంగానే జరుగుతున్న విషయం తెలిసిందే. చిన్న, పెద్ద హీరోలన్న తారతమ్యం లేకుండా ప్రతి హీరో కూడా, విడుదలకు ముందు సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ చాట్స్ చేయడం, వెబ్ ఇంటర్వ్యూలలో పాల్గొనడం అనేది చాలా సహజంగా మారిపోయింది. అలాగే సినిమాలకు సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారం కూడా పీఆర్వోల ద్వారా, మొదటగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలోనే ప్రత్యక్షం అవుతున్నాయి.

అందులో భాగంగానే “స్పైడర్” సినిమా సెన్సార్ అయిన సంగతిని సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తన సోషల్ మీడియాలో పంచుకోగా, వెంటనే సదరు ప్రముఖుడికి రిప్లైల మీద రిప్లైలు వచ్చిపడ్డాయి. ఇందులో వింతేముంటుంది… పెద్ద సినిమా కాబట్టి ఆ మాత్రం హంగామా పాజిటివ్ గా అయినా, నెగటివ్ గా అయినా సహజం కదా… అనుకుంటే, అక్కడ పొరపాటు పడ్డట్లే..! సదరు ప్రముఖుడికి వచ్చిన నెగటివ్ రిప్లైలన్నీ ఒకే విధంగా ఉండడంతో, దీని వెనుక ఎవరో ఉన్నారని అర్ధమవుతోంది.

‘స్పైడర్’ సెన్సార్ పూర్తయ్యింది, ‘యు/ఎ’ సర్టిఫికేట్ పొందింది అని చెప్పగానే… ‘దానికి సెన్సార్ అయితే మేం ఏం చేయాలి అంకుల్…’ అంటూ వివిధ ఐడీల నుండి ఒకే రకమైన రిప్లైలు రావడంతో, ఇదేదో కావాలని పనికట్టుకుని, కొంతమంది కుట్ర పూరితంగా ‘స్పైడర్’పై చేస్తున్న ప్రక్రియగా భావించిన సదరు సినీ ప్రముఖుడు, దానిని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో అది కాస్త వైరల్ అవుతూ ట్విట్టర్ లో హంగామా చేస్తోంది. ఇలాంటి ‘నెగటివ్’ పబ్లిసిటీ చేయడానికి కొంతమందిని నియమిస్తున్నారనేది సదరు సినీ ప్రముఖుని అంచనా.