Spyder Latest Working Stills Mahesh Babu‘బూమ్ బూమ్’ అంటూ ఇటీవల ప్రేక్షకులను పలకరించిన మురుగదాస్ – మహేష్ బాబుల “స్పైడర్” నుండి మరో పాట ఎప్పుడు విడుదల అవుతోంది. ఫస్ట్ సాంగ్ అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో, రెండవ పాట ఈ ఆల్బమ్ కు అత్యంత కీలకం కానుంది. హారిస్ జయరాజ్ స్వరపరిచిన రెండవ పాటను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.

ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఆగష్టు 9వ తేదీన విడుదల కానున్న టీజర్ తర్వాత, 15వ తేదీన రెండవ పాటను, 23వ తేదీన మరో పాటను గానీ, ధియేటిరికల్ ట్రైలర్ ను గానీ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఒకవేళ 23న పాట విడుదలైతే, 30వ తేదీన ట్రైలర్ ను విడుదల చేస్తారని, అదే 23న ట్రైలర్ విడుదలైతే 30న మరో పాటను విడుదల చేయనున్నారని ట్రేడ్ వర్గాల టాక్.

సెప్టెంబర్ 27వ తేదీకి ముహూర్తం ఖరారు చేసుకున్న ఈ సినిమాకు ఆడియో వేడుకను నిర్వహిస్తారా? లేక నేరుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నే ఏర్పాటు చేస్తారా? అన్న విషయం ఇంకా ఖరారు కాలేదు. అయితే తెలుగు నాటతో సమానంగా కోలీవుడ్ లో కూడా స్వయంగా మహేష్ బాబు పాల్గొనే విధంగా పబ్లిసిటీని నిర్వహించబోతున్నట్లు స్పష్టమైన సమాచారం. తమిళ ప్రచారం అంతా సెప్టెంబర్ లోనే జరగనుంది.