spy-reddy-health-in-critical-conditionనంధ్యాల రాజకీయ కురువృద్ధుడు ఎస్పీవై రెడ్డి చంద్రబాబు మీద అలిగి జనసేనలో చేరిపోయారు. వీరికి జనసేన పార్టీ ఏకంగా నాలుగు టికెట్లిచ్చింది. ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులు పోటీ చెయ్యడం విశేషం. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఆయన చిన్న కుమార్తె అరవిందరాణి బనగానపల్లి శాసనసభ అభ్యర్థిగా, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి నంద్యాల శాసనసభ స్థానంలో పోటీ చేస్తున్నారు.

నామినేషన్ల విత్ డ్రాకి ముందు ఎమ్మెల్సీ ఇస్తాం తప్పుకోండి అని చంద్రబాబు బహిరంగంగా పిలుపునిచ్చారు. ఒకదశలో వారు తప్పుకుంటారు అని వార్తలు వచ్చినా చివరికి పోటీలోనే ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఎండదెబ్బకు ఎస్పీవై రెడ్డికు తీవ్రమైన జ్వరం రావడంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఎస్పీవై రెడ్డి ఇటువంటి పరిస్థితులలో ఉండడంతో ప్రచారం మందకొడిగానే సాగింది.

ఎస్పీవై రెడ్డి వర్గమే ప్రచారం చూసుకుంటుంది. కుటుంబసభ్యులు కూడా పెద్దగా ప్రచారంలో పాల్గొనడం లేదు. దీనితో వీరి పోటీ నామమాత్రంగానే ఉంది. ఎస్పీవై రెడ్డి మీద ఉన్న అభిమానంతో పడే ఓట్లే పడొచ్చు అని సమాచారం. దీనితో స్థానిక జనసేన కార్యకర్తలు నీరసించి పోయారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో వీక్ గా ఉన్న జనసేన ఈ ప్రాంతంలో తమ ఖాతా ఓపెన్ చెయ్యడానికి ఎస్పీవై రెడ్డి కుటుంబం మీదే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు అది జరిగేలా కనపడటం లేదు.