Sports Authority Of Andhra Pradesh New Policyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 52 బ్యాడ్మింటన్ కోర్టులు, 10 టెన్నిస్ కోర్టులు, 4 స్కేటింగ్ రింగ్‌లను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) నిర్వహిస్తోంది. అయితే ఇకపై వాటి నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం వేలంపాట నిర్వహించి కనీసం రెండేళ్ళ కాలానికి లీజుకి అప్పగించేందుకు శాప్ సిద్దమైంది.

ముందుగా గుంటూరు జిల్లా పరిధిలో గల 4 బ్యాడ్మింటన్ కోర్టులను ఒక స్కేటింగ్ రింగ్‌ను లీజుకి ఇచ్చేందుకు వేలంపాట నిర్వహించబోతున్నట్లు శాప్ (గుంటూరు) పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీని కోసం రూ.10,000 డిపాజిట్ చేసి, రేపటిలోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించాలని శాప్ కోరింది.

దీనిపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ వరుసగా అనేక ట్వీట్స్ పెట్టి ప్రభుత్వ నిర్ణయం నిరుపేద ఔత్సాహిక క్రీడాకారులకు శాపంగా మారబోతోందని, ఈ దెబ్బకి వారందరూ క్రీడలకు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు సైతం చివరి నిమిషం వరకు ఎటువంటి సాయం అందించకుండా వేధించారని, ఇప్పుడు నిరుపేద క్రీడాకారుల జీవితాలతో జగన్ ప్రభుత్వం గేమ్స్ ఆడుతోందని నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

అర్హత లేనివారిని, వయసు మీరిన వారిని సలహాదారులుగా పెట్టుకొని వారికి నెలనెలా లక్షలు జీతభత్యాలు చెల్లిస్తున్న జగన్ ప్రభుత్వం, నిరుపేద క్రీడాకారుల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరించడాన్ని నారా లోకేష్‌ తీవ్రంగా తప్పు పట్టారు. శాప్ నిర్ణయం నిరుపేద క్రీడాకారులకు శాపంగా మారుతుందని, దీంతో రాష్ట్రం క్రీడలలో పూర్తిగా వెనుకపడిపోతుందని కనుక ఇకనైనా ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని నారా లోకేష్‌ విజ్ఞప్తి చేశారు. అయితే టిడిపి నేతలను చూస్తేనే మండిపడే వైసీపీ నేతలు వారు మంచిమాట చెపితే వింటారనుకోవడం అత్యాసే కదా?

Sports Authority Of Andhra Pradesh