KCR TRS- - Uttam Kumar Reddy-congressఇటీవలే వచ్చిన ఘోర పరాజయం నుండి ఇంకా పాఠాలు నేర్చుకున్నట్టుగా లేరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఒకపక్క పార్టీని కబళించడానికి తెరాస నేతలు వ్యూహాలు రచిస్తున్నా వారు అంతర్గత కుమ్ములాటలు వదలడం లేదు. ఇప్పుడు తాజాగా శాసనసభలో శాససభా పక్ష నేత పదవి సీనియర్లలో చిచ్చు రేపుతోంది. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా దళితుడైన భట్టి మల్లు విక్రమార్క ను ఆ పదవికి ఎంపిక చెయ్యాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తుంది. భట్టి ఎంపికకు మరో సీనియర్ నేత శ్రీధర్ బాబు ఒప్పుకున్నట్టు సమాచారం.

తమ ఇద్దరిలో ఎవరికీ ఇచ్చినా తమకు ఒకే అని వారు అధిష్టానానికి తెలిపారట. అయితే దీనిని కోమటిరెడ్డి వర్గం వ్యతిరేకిస్తుంది. అంతటితో ఆగకుండా ఆయన అధిష్టానాన్ని బెదిరించే ప్రయత్నంలో ఉన్నారట. తనకు కాంగ్రెస్ నుండి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 12 మంది సపోర్టు ఉందని కోమటిరెడ్డి చెప్పుకుంటున్నారని సమాచారం. ఒకవేళ తనను నిరాకరిస్తే పార్టీలో చీలిక తేవడానికి కూడా వెనుకాడనని అధిష్టానాన్ని ఇండైరెక్టుగా బెదిరిస్తున్నారట ఆయన.

కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ పరిణామాలను తెరాస గమనిస్తున్నట్టు సమాచారం. అవసరాన్ని బట్టి రంగంలోకి దిగి వీలైతే కోమటిరెడ్డి వర్గాన్ని విడదీసి కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. ఇదే జరిగితే తెలంగాణాలో కాంగ్రెస్ కు అస్తిత్వ సమస్యగా పరిణమించవచ్చు. దీనితో ఈ సమస్యను ఎలా ఎదురుకోవాలా అని అధిష్టానం తలపట్టుకుంటుంది. ప్రభుత్వం మీద పోరాడటం మానేసి తమలో తాము కొట్టుకోవడంతో బంగారు పల్లెంలో అధికారాన్ని కట్టబెట్టారు తెరాసకు.

తెలంగాణ రాష్ట్ర సమితి సునామీలో సీనియర్లు కూడా కొట్టుకుపోయారు. మిగిలిన వారు కూడా పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే దారిలో వెళ్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మరోసారి దారుణమైన ఫలితాలకు కాంగ్రెస్ సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ కు ఒక్కటి గెలిచినా అది అద్భుతమే అని పరిశీలకులు కూడా కొట్టి పారేస్తున్నారు. ఈ కొట్లాటలతో డిపాసిట్లు కోల్పోయే స్థాయికి పార్టీని దిగజారుస్తారేమో.. కాంగ్రెస్సా మజాకా…. !!!