YS Jagan Special Pacakages to Amaravati Farmersమూడు రాజధానుల అంశంలో జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీలు సమర్పించిన నివేదికలపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ రేపు ఉదయం మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం. అభివృద్ధి వికేంద్రీకరణతోపాటు పాలనా వికేంద్రీకరణ జరగాలని హైపవర్‌ కమిటీ తొలి భేటీలోనే కమిటి తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

రేపు జరగనున్న రెండో సమావేశంలో రాజధాని ప్రాంత రైతులు, అభివృద్ధిపై చర్చించనున్నట్లు సమాచారం. అసహనంగా ఉన్న రైతులకు మరింత మెరుగైన ప్యాకేజీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సమావేశం అనంతరం రాజధాని రైతుల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

భూములు ఇచ్చిన రైతులను సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలు, ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై హైపవర్‌ కమిటీ చర్చించనుందని సమాచారం. ఇది ఇలా ఉండగా రైతులు మాత్రం కొత్తగా ప్రకటించే ప్యాకేజీలకు తాము ఒప్పుకునే పరిస్థితి లేదు అంటున్నారు.

తమకు హామీ ఇచ్చినట్టుగా భూములను అభివృద్ధి చేసి ఇవ్వాలని, లేని పక్షంలో 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. మొదటి ఆప్షన్ కు ప్రభుత్వం సిద్ధంగా లేని సంగతి తెలిసిందే. రెండో ఆప్షన్ కింద రైతులకు దాదాపుగా 75,000 కోట్ల పరిహారం ఇవ్వాల్సి రావొచ్చు.