tammineni sitaram ఒక్కోసారి రాజకీయ నాయకులు అప్రయత్నంగా ఒక విషయం గురించి నొక్కి చెప్పబోయి మరేదో మాట్లాడి నవ్వులపాలవుతుంటారు. కొన్నిసార్లు చాలా సీరియస్‌గా ఇంగ్లీషులో తప్పులు తడకలు మాట్లాడేస్తూ నవ్వులు పూయిస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా అదేవిదంగా ఎంతో ఆవేశంగా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడుతూ ఆయనకు అసలు ‘మైండ్ ఉందా?’ అని అడగాలనుకొని ‘సెన్సాఫ్ హ్యూమర్ ఉందా?” అంటూ కళ్ళు ఎర్రజేసి అడగడం చూసి, ‘హా… నిజమైన సెన్సాఫ్ హ్యూమర్ అంటే ఇదే’ అని నెటిజన్స్ నవ్వుకొంటున్నారు.

ఇంతకీ తమ్మినేని ఏమన్నారంటే, “ దురదృష్టకరం అంటున్నాడు ఓ పెద్దమనిషి కొంగజపం. అదృష్టకరం అంటే ఏమిటో చెప్పూ. తప్పూ…కులాల పేరుతో…మతాల పేరుతో… జాతుల పేరుతో… ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పూ… చెప్పండి… ప్రభుత్వానికి బాధ్యత లేదంటాడా ఆ పెద్దమనిషీ?అని అంటూ ‘మెదడు ఉందా?’అన్నట్లు చేతితో తలని చూపిస్తూ, “ఉందా…అసలు సెన్సాఫ్ హ్యూమర్ ఉందా?” అని ఆగ్రహంగా అడిగారు.

దాంతో అంతవరకు ఆయన ఆవేశంతో మాట్లాడినా మాటలన్నీ వింటున్నవారు పక్కున నవ్వుతున్నారు. సెన్సాఫ్ హ్యూమర్ అంటే అర్ధం తెలియకుండానే ‘సెన్సాఫ్ హ్యూమర్ ఉందా?’ అని అడిగినందుకు సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న నెటిజన్స్ నవ్వుకొంటున్నారు. మీకు లేనప్పటికీ మాకు ఉందంటూ రీట్వీట్ చేస్తున్నారు.

“అమలాపురంలో జరిగిన అల్లర్లు దురదృష్టకరం…”అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి సందర్భాలలో ఏ రాజకీయ నాయకుడైనా అదే విదంగా స్పందిస్తాడు. ఆయన ఈ ఘటనలు ఖండిస్తున్నారనే విషయాన్ని గుర్తించకుండా ‘దురదృష్టకరం’ అనే పదాన్ని మాత్రమే క్యాచ్ చేసి “అయితే అదృష్టకరం అంటే ఏమిటో చెప్పు?” అని ఆగ్రహంగా ప్రశ్నిస్తుండటం చూసి జనాలు నవ్వుకొంటున్నారు.