speaker tammineni sitaramఏపీ అసెంబ్లీలో టీడీపీ సస్పెన్షన్ల పరంపర ప్రతి రోజు కొనసాగుతూనే ఉంది. టీడీపీ నాయకులు సభా మర్యాదలు పాటించడం లేదంటూ టీడీపీ సభ్యులలో నలుగురిని పూర్తి సెషన్ కు, మరో ఇద్దరిని ఈ రోజు అసెంబ్లీ సమావేశాల నుండి స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం పాలసీ మీద చర్చకు టీడీపీ పట్టుపట్టగా, అందుకు ప్రభుత్వం యధావిధిగా నిరాకరించడంతో స్పీకర్ పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు.

పోడియం వద్దకు రాకూడదనే సభ మర్యాదలు కూడా టీడీపీ పార్టీ వారికి తెలియవా? అంటూ స్పీకర్ తప్పుపట్టారు. తెలుగుదేశం నాయకులకు సభా సంప్రదాయాలను మీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పలేదా? సభలో సంస్కారంగా ప్రవర్తించాలనే కనీస ఆలోచన కూడా మీకు లేదా? అంటూ టీడీపీ సభ్యులను తమ్మినేని ప్రశ్నించారు.

సంస్కారం – సభా మర్యాదలు అంటూ స్పీకర్ చాలా బరువైన పదాలను వినియోగిస్తుంటే వినడానికి కాస్త విడ్డురంగా ఉందంటున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సభలో బూతులు మాట్లాడిన మీ వైసీపీ మంత్రి నుండి సంస్కారం నేర్పమని తిరిగి కౌంటర్ వేశారు టీడీపీ నేతలు. ఈ సందర్భంగా సభలో విజిల్స్ తీసుకొచ్చి సౌండ్ చేసారు టీడీపీ నేతలు.

సభలో టీడీపీ నాయకులు సినిమా ధియేటర్ లో మాదిరి చిల్లర వేషాలు వేస్తున్నారని జోగి రమేష్ విమర్శించారు. విజిల్స్ వేస్తేనే చిల్లర వేషాలంటే.., ధియేటర్లో సినిమా టికెట్స్ అమ్మిన ఈ వైసీపీ ప్రభుత్వం చేసిందేమిటో కూడా చెప్పాలని టీడీపీ నేతలు ప్రతివిమర్శ చేశారు.

సభలోకి విజిల్స్ తో పాటు ఇంకా ఏమైనా ఆయుధాలు తీసుకువచ్చారేమో చూడాలంటూ అంబటి రాంబాబు సభను అడుగగా, టీడీపీ నాయకుల దగ్గర విజిల్స్ మాత్రమే ఉంటాయి అధ్యక్షా! గొడ్డళ్లు ఉండవంటూ సెటైర్లు వేస్తున్నారు టీడీపీ వర్గీయులు.

ప్రజల ప్రాణాల కన్నా ఈ వైసీపీ మంత్రులకు; నాయకులకు జగన్ భజనే ఎక్కువైంది అంటూ సభ నుండి సస్పెండ్ అయిన టీడీపీ నాయకులు విమర్శించారు. చెవుల్లో సీసాలు పోసుకున్నారో, ఏమో కానీ ప్రజల ఆర్తనాదాలు వైసీపీ ప్రభుత్వాన్ని వినపడడం లేదా? సభను నడిపించే తీరు చూస్తుంటే కౌరవ సభను తలపించే తీరుగా ఈ వైసీపీ నాయకుల ప్రవర్తన ఉందని టీడీపీ సీనియర్ లీడర్ గద్దె రామ్మోహనరావు మండిపడ్డారు.

“సంప్రదాయాలు – సంస్కారాలు,” “కోడి కత్తి – గొడ్డలి వేటు” వంటి వాటి గురించి వైసీపీ నేతలే చెప్పాలి అని నెట్టింట మేమ్స్ తో నెటిజన్లు సందడి చేస్తున్నారు.