SP Balasubramanyam on water scarcityనీటి కోసం యుద్ధాలు జరుగుతాయని పెద్దలు చెప్పిన మాటలు ప్రస్తుతం కార్యరూపం దాలుస్తున్న వైనం చూస్తున్నదే. అలాగే నీటిని సరఫరా చేయలేక క్రికెట్ మ్యాచ్ లను నిర్వహించడంపై జరుగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కోసం మాటల తూటాలు పేలాయి… తాజాగా చంద్రబాబు కూడా నీటి అవసరాలపై ప్రకటనలు చేసారు.

ఇంతటి ప్రాధాన్యత ఉన్న నీటిపై ‘గిన్నీస్ బుక్’కెక్కిన గాయకుడు ‘స్వరమాంత్రికుడు’ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన ఆవేదనను వ్యక్తపరిచారు. గత కొన్ని రోజులుగా తాను హైదరాబాద్ లో ఉన్నానని, ఈ సందర్భంగా రెండు రోజుల్లో వివిధ కుటుంబ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ప్రతి కార్యక్రమంలో మినరల్ వాటర్ బాటిల్స్ సరఫరా చేశారని తెలిపిన ఎస్పీ.., ఆ మినరల్ వాటర్ బాటిళ్లలో కొంత నీటిని తాగిన తరువాత, ఆ బాటిళ్లను టేబుల్స్ కింద పెడుతున్నారని, ఇలా మిగిలిపోయిన మినరల్ వాటర్ బాటిల్స్ లోని నీటిని వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే అలా చేసే బదులు… తాము తాగిన వాటర్ బాటిల్స్ ను అతిథులే వాటిని తమ వెంట తీసుకువెళ్లి ఆ నీళ్లను వాడుకోవాలని లేదా కార్యక్రమ నిర్వాహకులు వాటిని సేకరించి, వాటిల్లోని నీటిని మరో మంచి పనికి ఉపయోగించాలని ఈ సందర్భంగా బాలు సలహా ఇచ్చారు. దేశంలోని పలు ప్రాంతాలు తాగునీటికి కటకటలాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అతిథులు ఇలా ప్రవర్తించడం సరికాదని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హితవు పలికారు.