sp-balasubrahmanyam-statue-gunturఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసపాలనకు శ్రీకారం చుట్టి మూడున్నరేళ్ళ తర్వాత కూడా జంకూగొంకూ లేకుండా అదేవిదంగా కొనసాగుతోంది. ఇటీవల ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఎన్టీఆర్‌ టిడిపి వ్యవస్థాపకుడు… టిడిపి అంటే వైసీపీకి గిట్టదు కనుక ఆయన పేరు తొలగించి సిఎం జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు పెట్టుకొన్నారని వైసీపీ మద్దతుదార్లు సర్దిచెప్పుకోవచ్చు.

కానీ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సంగీత, సాహిత్య, సినీ, కళామతల్లి ముద్దు బిడ్డడు, తెలుగు ప్రజలతో సహా దక్షిణాది రాష్ట్రాల ప్రజలను కూడా తన పాటలతో మెప్పించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో వైసీపీ ప్రభుత్వానికి ఏం విరోదం ఉందో అర్దం కాదు. గుంటూరు, లక్ష్మీపురం సెంటరులో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని గుంటూరు మునిసిపల్ సిబ్బంది నిన్న రాత్రి తొలగించేశారు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే ఆయన పట్ల ఎంతో గౌరవంతో ఏర్పాటుచేసుకొన్న ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఓ మొబైల్ టాయిలేట్ పక్కన పెట్టేరు. అది చూసి తెలుగు ప్రజలందరూ ఆవేదన చెందుతున్నారు. అసలు జగన్ ప్రభుత్వం ఈవిదంగా ఎందుకు చేస్తోంది? అని సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు.

తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసి చనిపోయినవారిని కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈవిదంగా వ్యవహరిస్తూ అవమానిస్తుండటం చాలా బాధాకరం. వైసీపీ హయాంలో జరుగుతున్న ఇటువంటి అవాంఛనీయ ఘటనలు, నిర్ణయాలను చూస్తున్నప్పుడు, సంస్థలకు పేర్ల ఏర్పాటు, అలాగే రాష్ట్రంలో విగ్రహాల ఏర్పాటుకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావలసిన అవసరం కనిపిస్తోంది. ఆ చట్టప్రకారమే సంస్థలకు పేర్లు, విగ్రహాల ఏర్పాటుకు ఒకసారి అనుమతించిన తర్వాత భవిష్యత్‌లో ఎన్నడూ ఆ పేర్లు మార్చడానికి వీలులేకుండా, విగ్రహాలను తొలగించడానికి వీలులేకుండా చట్టంలో నియమనిబందనలు రూపొందిస్తే, ఇటువంటి అవాంఛనీయ నిర్ణయాలు, ఘటనలు జరుగకుండా నివారించవచ్చు. అలాగే దివంగత ప్రముఖులను అవమానించకుండా నివారించవచ్చు.