పుండు మీద కారం జల్లడం అంటే ఇదే! తిరుపతిలో నిర్వహించిన 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఇందులో పాల్గొన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినంట్ గవర్నర్లు ఎవరు వినతులు వాళ్ళు వెలిబుచ్చుకున్నారు. ఈ సమావేశంలో లేవనెత్తిన సమస్యలు పరిష్కారం ఎప్పుడు అవుతాయో తెలియదు గానీ, ఈ సమావేశం ముగిసిన తర్వాత కేంద్రమంత్రి అమిత్ షా చేసిన ట్వీటే సమస్యగా మారిందనేది సోషల్ మీడియా టాక్.

తిరుపతిలో సభ నిర్వహిస్తూ… కనీసం బ్యానర్ పైన తెలుగులో ముద్రించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోమ్ శాఖా మంత్రివర్యులు పోస్ట్ చేసిన ఫోటో వెనుక ఉన్న బ్యానర్ ను ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో మాత్రమే రూపొందించారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహిస్తూ… కనీసం ఏ ఒక్క భాషను కూడా లిఖించకపోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది.

‘పుండు మీద కారం జల్లడం’ అంటే ఇదే అన్న చందంగా… ఈ అమిత్ షా గారు వేసిన ట్వీట్ లో… ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ భాషలను గౌరవిస్తారు, అందుకే నేడు జరిగిన ఈ సమావేశం ఉదంతాన్ని అన్ని భాషలలోకి తర్జమా చేయనున్నారని అన్నారు. ‘హిందీ’ భాషకు ఇచ్చినంత ప్రాముఖ్యత ప్రాంతీయ భాషలకు ఎక్కడ ఇస్తున్నారు? అని నెటిజన్లు ఇస్తోన్న రిప్లై ట్వీట్స్ కోకొల్లలు!