South Africa tour of England, 2017ఇంగ్లాండ్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ 20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి టీ20ని అవలీలగా చేజిక్కించుకున్న ఇంగ్లాండ్ జట్టు, రెండవ టీ 20లో విజయపు అంచుల దాకా వచ్చి బోర్లా పడింది. నిజానికి ఒకానొక దశలో ఇంగ్లాండ్ దే పక్కా విజయం అని భావించగా, చివరి అయిదు ఓవర్లలో మ్యాచ్ ను తమ వైపుకు తిప్పుకోవడంలో సఫారీ బౌలర్లు కీలక పాత్ర పోషించారు.

తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. స్ముత్స్ 45, డివిలియర్స్ 46, బెహర్దిన్ 32 పరుగులతో సత్తా చాటారు. దీంతో భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఒకానొక సమయంలో 125 పరుగులకు కేవలం 2 వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉంది. అప్పటికే క్రీజులో ఓపెనర్ రాయ్ హాఫ్ సెంచరీతో పాతుకుపోయి ఉన్నాడు.

అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్! తమ ఫీల్డింగ్ కు అడ్డు వచ్చాడంటూ సఫారీ జట్టు ఎంపైర్లకు అప్పీల్ చేయగా, దానిని థర్డ్ ఎంపైర్ కు ఇచ్చారు. అనేక సార్లు పరిశీలించిన మీదట ‘అబ్ స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ పేరుతో రాయ్ ను అవుట్ అయినట్లుగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ సఫారీ వైపు టర్న్ అయ్యింది. వరుసగా బట్లర్, మోర్గాన్, లివింగ్ స్టోన్ లు అవుట్ కావడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ నుండి చేజారిపోయింది.

ఓపెనర్ రాయ్ 45 బంతుల్లో 67 పరుగులతో సత్తా చాటగా, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ బైర్ స్టౌ 47 పరుగులతో రాణించాడు. అయితే కీలకమైన సమయంలో ఒత్తిడిని అధిగమించలేక విజయం ముంగిట బోర్లా పడింది. 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీసిన మోరిస్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. దీంతో రెండు మ్యాచ్ లు ముగిసే సమయానికి చెరో విజయంతో సిరీస్ (1-1) సమంగా నిలిచింది.