Sourav Ganguly joining BJPబీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గంగూలీ బీజేపీలో చేరబోతున్నాడంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ అధికారంలో ఉన్నా మమతా బెనర్జీని ఎలాగైనా గద్దె దించాలని కృతనిశ్చయంతో ఉంది.

గంగూలీ ఆధ్వర్యంలో బీజేపీ బరిలోకి దిగనుందని సమాచారం. త్వరలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. గంగూలీ సారథ్యంలోని ట్రస్ట్‌ కోల్‌కతాలో ఓ పాఠశాల నెలకొల్పాలనుకుంది. అందుకు ఈశాన్య కోల్‌కతాలోని అతి ఖరీదైన న్యూటౌన్‌ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారు రెండెకరాలు కేటాయించింది.

అయితే ఆ స్థలం న్యాయవివాదంలో చిక్కుకోవడంతో గంగూలీ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. బెంగాల్ లో సౌరవ్ గంగూలీ మీద విపరీతమైన అభిమానం ఉంది. తమ రాష్ట్రానికి అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చాడని అక్కడి ప్రజలకు ఆయన మీద గౌరవం. దీనిని క్యాష్ చేసుకోవాలని బీజేపీ ఆలోచిస్తుంది.

ఇది ఇలా ఉండగా… బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం 2020, సెప్టెంబరు తర్వాత అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం.. బీసీసీఐలో రెండు పర్యాయాలు ఏ పదవులైనా చేపట్టిన తర్వాత సభ్యులు కనీసం మూడేళ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది. గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా వెళ్తాడని కూడా వార్తలు వస్తున్నాయి.