sonia gandhi with media‘గాంధీ’ కుటుంబం పట్ల దేశ ప్రజలకు ఉన్న అభిమానం సోనియా గాంధీకి పదేళ్ళ అధికారం కట్టపెట్టింది. అయితే ప్రజలను భావోద్వేగాలకు గురి చేసే సమయాల్లో తప్ప మిగతా ఎప్పుడూ తానూ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అని ప్రస్తావించని సోనియా గాంధీ, తాజాగా ఓ కేసులో ఇరుక్కోవడంతో మళ్ళీ ప్రజల ‘సింపతీ’ పొందేందుకు ఈ సారి ఏకంగా ఇందిరా గాంధీని తెర పైకి తీసుకువచ్చారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో సమన్లు అందుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఓ విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు… తానెవరికీ భయపడే ప్రసక్తే లేదని, తాను ఇందిరాగాంధీ కోడలినని, అన్నీ విషయాలను ధైర్యంగా ఎదుర్కొంటానని, కోర్టే ఈ కేసు విషయాన్ని తేలుస్తుందని అన్నారు. ఈ కేసులో సోనియా, రాహుల్‌తో పాటు మరో ఐదుగుర్ని నిందితులుగా చేర్చిన సంగతి తెల్సిందే!

ఇక, ఈ రోజు కోర్టుకు హాజరు కావాల్సిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీలు డుమ్మాకొట్టారు. పిటిషన్ దారుడు అయిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామితో పాటు సోనియా, రాహుల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాత్రమే పాటియాల కోర్టుకు హాజరయ్యారు. కాగా ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుండగా ఈ ఉదయమే రాహుల్‌గాంధీ వరదలకు గురైన పుదుచ్చేరి, చెన్నై ప్రాంతాలను సందర్శించేందుకు అక్కడికి వెళ్లారు.

కేసు ఫ్లాష్ బ్యాక్ కు వెళితే… నేషనల్ హెరాల్డ్ పత్రిక సంస్థ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌కు కాంగ్రెస్ రూ.90.25 కోట్ల రుణాన్ని ఇచ్చింది. 2010 డిసెంబర్ 10న ఈ మొత్తాన్ని వసూలు చేసే బాధ్యతను యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) అనే చారిటీ సంస్థకు పార్టీ రూ.50 లక్షలకు అప్పగించింది. ఇంత పెద్ద మొత్తాన్ని వసూలు చేసే హక్కును వైఐఎల్‌కు రూ.50 లక్షలకే అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనుక ఉద్దేశాలపై కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. మరోవైపు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా ఇదే అంశాలను లేవనెత్తారు… అంతేకాదు వైఐఎల్‌లో సోనియా, రాహుల్‌లకు చెరో 38 శాతం వాటా ఉన్నట్లు ఆయన ప్రధాన ఆరోపణ. హెరాల్డ్‌కున్న ఆస్తులను చట్టబద్ధంగా సోనియా కుటుంబం సొంతం చేసుకుందంటూ స్వామి పిటిషన్ మేరకు కాంగ్రెస్ నేతలపై చీటింగ్ కేసు నమోదైంది. నేషనల్ హెరాల్డ్‌కు ఇండియా వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఓ అంచనా!