Sonia Gandhi and Manmohan Singh GST implementationఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయకుండా చరిత్రలో దిద్దుకోలేని తప్పును వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేశారన్నది నాడు రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు కూడా అన్న మాట. అమరావతిలో రాజధాని ఇష్టం లేకనే జగన్ రాలేదని చెప్పిన అధికార పక్షం మాటలే చివరికి ప్రజల్లోకి వెళ్ళడంతో, అందుకు అనుగుణంగానే రాజధానిని అడ్డుకునే విధంగా తన అనుయాయుల చేత కేసులు వేయించడం బహిర్గతం కావడంతో… అమరావతిని రాజధానిగా ఒప్పుకునే పరిస్థితులలో జగన్ లేరని స్పష్టమైంది.

అయితే జగన్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే… ఏపీ రాజధానిగా అమరావతి అన్న పేరు చట్టంలోకి వెళ్లిపోయింది. ఒకవేళ తదుపరి జగన్ ముఖ్యమంత్రి అయినా, దానిని చేయగలిగేదేమీ ఉండదు. ఇక్కడే రాజకీయ పరిపక్వత లోపించిందనేది రాజకీయ విశ్లేషకులు తేల్చిన విషయం. నిజానికి నాడు రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాజరై హుందాగా వ్యవహరించినట్లయితే, అమరావతిగా రాజధానికి గానీ, ఆ ప్రాంత ప్రజలకు గానీ తాను విరుద్ధం కాదన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళినవారయ్యేవారు.

నాడు అనుభవరాహిత్యంతో ‘పిల్ల కాంగ్రెస్’గా పిలవడమే వైసీపీ ఏం చేసిందో… నేడు వందల సంవత్సరాల అనుభవం ఉన్న ‘తల్లి కాంగ్రెస్’ కూడా అదే చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒకే దేశం – ఒకే పన్ను అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు అర్ధరాత్రి నుండి ప్రారంభించనున్న ‘జీఎస్టీ’ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హాజరు కాబోదంటూ స్పష్టం చేసారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు కీలక నిర్ణయంగా భావించిన జీఎస్టీ అమలుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా ఆహ్వానం పంపించారు గానీ, పార్టీ నిర్ణయం రీత్యా మన్మోహన్ కూడా హాజరు కావడం లేదు.

ఒకవేళ ఎలాంటి సంచలనాలైనా జరిగి, తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, జీఎస్టీని ఎత్తివేసి మళ్ళీ పాత పన్ను విధానాన్ని అమలుపరిచే సౌకర్యం లేదు. మరి అలాంటి ఆర్ధిక సంస్కరణలకు హాజరు కాకుండా కాంగ్రెస్ అతి పెద్ద తప్పిదానికి పాల్పడుతోందంటూ రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఏపీలో జగన్ ఎలాగో, కేంద్రంలో కాంగ్రెస్ అలాగే వ్యవహరిస్తుండడం విశేషం. అందుకే రాజకీయ వర్గాలు ఈ రెండు పార్టీలను ‘పిల్ల కాంగ్రెస్ – తల్లి కాంగ్రెస్’ అని సంభోదిస్తున్నాయేమో..!