son-of-satyamurthy-hindi-dubbed-youtube-recordsతెలుగు సినిమాలను హిందీలోకి డబ్ చేసి యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్న వైనం గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నదే. అయితే ఇటీవల కాలంలో ఈ ఆదరణ మరింతగా పెరగడంతో, టాప్ హీరోలు నటించిన ప్రతి సినిమా దాదాపుగా హిందీలోకి డబ్ అవుతోంది. తెలుగునాట ఫ్లాప్ అయిన ‘రామయ్యా వస్తావయ్యా’ వంటి సినిమాలకు కూడా హిందీలో మంచి ఆదరణ ఉండడం విశేషం. అయితే తాజాగా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “సన్నాఫ్ సత్యమూర్తి” సినిమా యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

తెలుగు నుండి హిందీలోకి డబ్ అయిన సినిమాల జాబితాలో ఈ “సన్నాఫ్ సత్యమూర్తి” ఏకంగా అగ్ర స్థానంలోకి చేరుకుంది. దాదాపుగా ఒక నెల క్రితం యూ ట్యూబ్ లో విడుదలైన ఈ సినిమా అప్పుడే కోటి క్లిక్స్ అందుకుని ఆల్ టైం రికార్డులు సృష్టించింది. ఇంత తక్కువ సమయంలో 10 మిలియన్స్ అందుకున్న మరో తెలుగు సినిమా మరొకటి లేదు. దీంతో ఈ ఏడాది ఇప్పటికే “సరైనోడు”తో సూపర్ సక్సెస్ అందుకున్న అల్లు వారబ్బాయి… యూ ట్యూబ్ లో కూడా అదిరిపోయే రికార్డును సొంతం చేసుకున్నాడు.

దీంతో బన్నీకి ఈ ఏడాది మెమరబుల్ విషయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా జోడవ్వడం విశేషం. బహుశా ‘మాటల మాంత్రికుడు’ హిందీ డైలాగ్స్ బాలీవుడ్ ప్రియులను కూడా అమితంగా ఆకట్టుకున్నాయేమో గానీ, యూ ట్యూబ్ ను సత్యమూర్తి గారబ్బాయి ఏలుతున్నాడు. బన్నీ మాదిరే త్రివిక్రమ్ కూడా ఈ ఏడాది ‘అ…ఆ…’ ద్వారా ఊహించని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.