Somu Veerrajuతిరుపతి లోక్ సభకు జరిగే ఉపఎన్నికలలో ప్రభావం చూపించడానికి బీజేపీ తమ వంతు ప్రయత్నం తాము చేస్తుంది. ఆ పార్టీ కీలక నేతలు అక్కడే మకాం వేసి పార్టీ సేనలను సన్నద్ధం చేస్తున్నారు. నిన్న తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా పాపం టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేశారు.

ప్రత్యేక హోదా ఇవ్వడంలో బీజేపీ విఫలం అయ్యింది అని ఒక పాత్రికేయుడు అనగా…. “ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు రాకపోవడానికి కారణం చంద్రబాబే. నాకు ప్రత్యేక హోదా వద్దు…. ప్యాకేజీ కావాలి అని ఆయనే కేంద్రాన్ని అడిగారు,” అంటూ సోము వీర్రాజు మీడియాతో చెప్పుకొచ్చారు.

కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అన్నాకా ప్యాకేజీ ని ఇవ్వజూపింది. పొత్తు ధర్మాన్ని పాటించి ప్యాకేజీ కు ఒప్పుకున్నారు చంద్రబాబు. అయితే ఆ తరువాత ప్రజాభీష్టం మేరకు మళ్ళీ ప్రత్యేక హోదా వైపు మళ్లారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం టీడీపీ బీజేపీ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తుంది.

ఈ తరుణంలో బాబు మౌనం ని వాడుకుని ప్రత్యేక హోదా పాపాన్ని టీడీపీకి అంటగట్టాలని చూస్తున్నారు. మరి ఈ విషయంలో టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా అశాస్త్రీయ విభజనకు ప్రతిగా ఇస్తామని ప్రకటించిన ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ కు దూరం అయిపోయినట్టే.