Somu Veerrajuఏపీలో బిజెపి రాజకీయంగా లబ్ది పొందాలని మాత్రమే ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది తప్ప ఏపీకి చేసిందేమీ లేదు. కనీసం ప్రజల అభిప్రాయాలను, మనోభావాలను గౌరవించిన దాఖలాలు కూడా లేవు. ప్రత్యేకహోదా ఇవ్వబోమని తెగేసి చెప్పడం, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మిపడేస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనం.

ఏపీ ఆర్ధికపరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని సాక్షాత్‌ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో చెపుతుంటారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి అడిగినంతా నెలనెలా అప్పులు ఇప్పిస్తూనే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే కేసుల విషయంలో కూడా కాదనకుండా ఉదారంగా సహాయసహకారాలు అందిస్తూనే ఉంటుంది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిని కాదని సిఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులంటూ నాలుగేళ్ళుగా కాలక్షేపం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు.

ఎందుకంటే, ఏపీలో బిజెపి గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం కనుచూపుమేర కనబడటం లేదు కనుక! అక్కరకు రాని రాష్ట్రం ఏపీని ఎందుకు పట్టించుకోవాలన్నట్లు వ్యవహరిస్తోందనే భావన ఆంధ్ర ప్రజలలోబలంగా ఉంది. అయితే వారి అభిప్రాయాలు, మనోభావాలు కూడా బిజెపికి అవసరం లేదు. కనుకనే ఏపీపట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భావించవచ్చు.

ఏపీలో మూడు ప్రధాన పార్టీలైన టిడిపి, వైసీపీ, జనసేనల రాజకీయ బలహీనతలు కూడా కేంద్రం నిర్లక్ష్యం లేదా అలసత్వానికి కారణమని చెప్పుకోవచ్చు. మూడు పార్టీలు కేంద్రం సహాయసహకారాల కోసం అర్రులు చాస్తుండటంతో, ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆడిండే ఆట పాడిందే పాటగా సాగుతోందని చెప్పవచ్చు.

కానీ ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు మాత్రం తమకు సిఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి ప్రత్యకమైన అభిమానం లేదని, ఆయన (వైసీపీ) నుంచి ఎటువంటి ప్రయోజనాలు ఆశించడంలేదని, కేవలం ఆంధ్రా ప్రజల మొహం చూసే జగన్మోహన్ రెడ్డికి సాయపడుతున్నామని చెప్పారు. కానీ బిజెపి రాజకీయాల గురించి తెలిసినవారెవరూ ఆయన మాటలను నమ్మరు. ఏపీలో బిజెపి అధికారంలోకి వస్తే దానికి సంతోషమే. కానీ రాకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే, ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్న దానిని గుప్పెట్లో పెట్టుకొని అవసరమైనప్పుడు ఆ పార్టీల ఎంపీల మద్దతు తీసుకోగలదు.

కనుక ఈ మూడు ప్రధాన పార్టీలు సొంతంగా కాళ్ళ మీద నిలబడేవరకు ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్రం తీరు మారదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ మూడు పార్టీలకు అంత ధైర్యం ఉందా… ఎప్పటికైనా కలుగుతుందా???