Somu Veerrajuపవన్ కళ్యాణ్ అడిగాడానో ఇంకోటో రాష్ట్ర నేతలు ఉన్నఫళంగా రాష్ట్రానికి చేసినవి లెక్కలు తీస్తున్నారు. కాసేపటిక్రితం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రానికి కేంద్రం చేసినవి చేస్తున్నవి చెప్పుకొచ్చారు. అయితే ఆ ప్రకటన చూస్తే అసలు బీజేపీకి పడే నాలుగు ఓట్లు పడకుండా చేసే ప్రయత్నమా అని అనిపించకమానదు.

పోలవరం నిర్మాణానికి 100 శాతం నిధులు ఇవ్వాలని మాత్రమే చట్టంలో ఉంది… పోలవరాన్ని ఎప్పటికి కట్టాలనే కాలపరిమితి చట్టంలో లేదని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఇండైరెక్ట్ గా మేము అనుకున్నప్పుడు కడతాం అడగడానికి ఎవరు సరిపోరు అని చెప్పినట్టేగా. ఈ మాట విన్నాకాకూడా ప్రాజెక్టును కేంద్రానికి ఎందుకు అప్పగించలేదు అని ఎవరైనా అడగగలరా?

మరోవైపు వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు ఎలా ఖర్చుపెట్టారు?, రాయలసీమ, ఉత్తరాంధ్రలో నిధుల ఖర్చుకు రాష్ట్రం దగ్గర బ్లూ ప్రింట్ ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఒక్కో జిల్లాకు కేంద్రం ఇస్తున్నది 50 కోట్లు. ఒక జిల్లాకు ఒక సంవత్సరానికి 50 కోట్లతో అభివృద్ధి చెయ్యడానికి బ్లూ ప్రింట్ కావాలా? 50 కోట్లతో ఒక జిల్లాలో స్వర్ణయుగం చెయ్యగలం అని ఆయన చెబుతున్నారా?

రైల్వేజోన్, దుగరాజుపట్నం పోర్టును పరిశీలించాలని మాత్రమే బిల్లులో పెట్టారు అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే టెక్నికల్ అంశాలతో ఎలా తప్పుకోవాలా అని బీజేపీ ప్రయత్నిస్తుందిగా రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదనేగా. అమరావతి భవనాల నిర్మాణానికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చింది, వెంకయ్యనాయుడు మరో రూ.వెయ్యి కోట్లు ఇచ్చారు అని ఆయన చెప్పుకొచ్చారు.

2500 కోట్లతో నరేంద్ర మోడీ చెప్పిన ఢిల్లీ తరహా రాజధాని సాధ్యమని సోము భావిస్తున్నారా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోవడంలేదని, ప్రత్యేక హోదా అంటూ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారు… రాజకీయ దుమారానికి మేం సమాధానమిస్తాని ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా లేదని ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లారు నిజమే.. కానీ హోదా వస్తే వచ్చే వాళ్ళు పెరుగుతారు. ఇలాంటి అడ్డదిడ్డమైన వాదనలతో ఏపీ ప్రజలను ఆకట్టుకోగలం అని బీజేపీ వారు భావిస్తున్నారా?