Somu Veerraju Press Meet after meeting with BJP Sunil Deodharజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌‌ విశాఖ పర్యటనలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుంటే, మరోపక్క ఈ ఘటనలపై స్పందించనందుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు కూడా విమర్శల పాలవడం విశేషం.

ఈ వ్యవహారంలో ఆయన తీరును తప్పు పడుతూ రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కుండబద్దలు కొట్టినట్లు తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. సోమూ వీర్రాజు నిర్లిప్త వైఖరి కారణంగానే పవన్‌ కళ్యాణ్‌ తమకు దూరమయ్యారని, చంద్రబాబు నాయుడుకి దగ్గరయ్యారన్నారు. బిజెపి, జనసేనలు కలిసి పోరాటం చేయడానికి కార్యాచరణ పధకం చెప్పాలని పవన్‌ కళ్యాణ్‌ కోరితే సోమూ వీర్రాజు పట్టించుకోలేదని కన్నా తప్పు పట్టారు.

విశాఖలో జరిగిన ఈ తాజా పరిణామాలు, విజయవాడలో పవన్‌, చంద్రబాబు భేటీ, కలిసి పనిచేద్దామనే వారి సంయుక్త ప్రకటన, సోమూ వీర్రాజు తీరుపై ఢిల్లీ బిజెపి పెద్దలకి పిర్యాదులు వెళ్ళడంతో తక్షణం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జ్ సునీల్ ధియోధర్ విజయవాడకు వచ్చి సోమూ వీర్రాజుతో భేటీ అయ్యి చర్చించారు.

అనంతరం సోమూ వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ, “విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ని హోటల్‌ గదిలో పోలీసులు నిర్బందించడం, ఆయన జనవాణి కార్యక్రమంలో పాల్గొనీయకుండా విజయవాడకు తిప్పి పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కన్నా లక్ష్మినారాయణ పార్టీలో చాలా సీనియర్. కనుక నేను ఆయన మాటలపై స్పందించను. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతాను. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఎప్పటికప్పుడు నేను మా అధిష్టానానికి తెలియజేస్తూనే ఉన్నాను. పవన్‌ కళ్యాణ్‌ రోడ్ మ్యాప్ అడిగిన మాట వాస్తవమే. దీనిపై మా పార్టీ పెద్దలు తగిన నిర్ణయం తీసుకొంటారు. ఆయనకు మా ఢిల్లీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి కనుక వారి సూచన మేరకు రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయి. పాదయాత్ర చేస్తున్న రైతుల మీద రాజమండ్రిలో వైసీపీ కార్యకర్తల చేత దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను,” అని అన్నారు.

ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోమూ వీర్రాజు, మిత్రపక్షంతో కలిసి పనిచేయడానికి కార్యాచరణ ఇవ్వలేని స్థితిలో ఉన్నారంటే నమ్మశఖ్యంగా లేదు. ఆయన కావాలనుకొంటే తమ అధిష్టానంతో మాట్లాడి రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో ఏవిదంగా ముందుకుసాగాలో నిర్ణయించుకోవచ్చు. కానీ పవన్‌ కళ్యాణ్‌ తమ ఢిల్లీ పెద్దలతో నేరుగా మాట్లాడే అంత సాన్నిహిత్యం కలిగి ఉండటం బహుశః సోమూ వీర్రాజు జీర్ణించుకోలేకనే ఆయనతో కలిసి పనిచేసేందుకు అయిష్టత చూపి ఉండవచ్చు. అయితే ఓ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సోమూ వీర్రాజు స్పందించకపోవడాన్ని ఏమనుకోవాలి? రాజమండ్రిలో రైతులపై దాడి జరిగి మూడు రోజులైతే ఇప్పుడా ఖండించేది?

ఇటువంటప్పుడే ఏపీ, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుల పనితీరులో ఉండే వ్యత్యాసం కళ్ళకు కట్టిన్నట్లు కనబడుతుంటుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందుకు కాకపోయినా సోమూ వీర్రాజు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నారు కనుక ఇకనైనా రాజకీయాలలో కాస్త యాక్టి వ్‌గా ఉంటే బాగుంటుందేమో?