Somu Veerraju - Pawan Kalyanపొత్తు పెట్టుకున్నాకా జనసేన, బీజేపీ పార్టీలకు మొట్టమొదటి పరీక్ష తిరుపతి ఉపఎన్నిక రూపంలో ఎదురుకానుంది. తెలంగాణలో బీజేపీ ఉన్న ఊపు కారణంగా బీజేపీ.. పోటీ చేసి పరువు నిలుపుకోవాలని జనసేన రెండు ఈ సీటు తమకంటే తమకు అని అడుగుతున్నాయి. అయితే ఆ సీటు ఎవరికీ అనేది తేలకముందే రెండు పార్టీలు నిట్టనిలువునా చీలిపోయాయి.

మొన్న ఆ మధ్య పవన్ కళ్యాణ్ తుఫాను బాధితుల పరామర్శ అంటూ తిరుపతిలో బలప్రదర్శన చేసి వచ్చారు. పవన్ పర్యటనలో ఎక్కడా బీజేపీ వారు కనిపించలేదు. మరోవైపు బీజేపీ సహా ఇంఛార్జ్ సునీల్ దేవధర్ కొంత కాలంగా తిరుపతిలోనే మకాం వేసి పార్టీని బూతు స్థాయి నుండీ బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండు పార్టీలు తిరుపతి విషయంలో సంయుక్తంగా పనిచేయకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. దీనితో చివరి నిముషంలో ఎవరు పోటీ చేసినా మూడవ స్థానం తోనే సరిపెట్టుకోవాల్సి రావచ్చు అని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరోవైపు.. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పటికే తిరుపతి ఉపఎన్నికకు తమ అభ్యర్థులను ఫైనల్ చేసాయి.

సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గ ప్రసాద్ రావు మరణించడంతో తిరుపతి ఉపఎన్నిక అనివార్యమైంది. సహజంగా ఎవరైనా సిట్టింగ్ ఎంపీ మరణిస్తే ఆయన కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వడం పరిపాటి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని మార్చింది. 2019లో ఈ సీట్లో వైఎస్సార్ కాంగ్రెస్ రెండున్నర లక్షల మెజారిటీ సాధించింది.