somu-veerraju-pawan-kalyan-kapu-communityపార్టీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా ఆదేశాలు ఇచ్చారు. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయనకు కీలక పదవి కట్టబెట్టడంతో ఆ వర్గంపై బీజేపీ గురిపెడుతుందని అవగతం అవుతుంది.

ఇప్పటికే అదే సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో బీజేపీ పొత్తుపెట్టుకుంది. ఈ నియామకంతో తాము కాపుల పక్షం అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలమైన వీర్రాజు, జగన్ ను బద్ద విరోధిలా చూసే పవన్ కళ్యాణ్ ఎలా కలిసి పని చెయ్యగలుగుతారో చూడాల్సి ఉంది.

2019లో కాపుల మీద పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రభావం చూపించలేకపోయారు. ఆ పార్టీ ఓట్లు గంపగుత్తుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి. అదే సమయంలో సోము వీర్రాజు ఓటర్లను ఆకర్షించే నేత అయితే కాదు. ఆయన చివరి సారిగా 2009 ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసి డిపాజిటు కోల్పోయారు.

ఆ తరువాత పోటీ చేసే సాహసం కూడా చెయ్యలేదు. 2019లో పోటీ చెయ్యమని పార్టీ ఒత్తిడి తెచ్చినా తనకు ఎమ్మెల్సీ పదవి ఇంకా ఉంది కాబట్టి వద్దు అని తప్పుకున్నారు. ఆయన నియామకం కాపులను ఎంతవరకు బీజేపీ వైపు తిప్పుకుంటుందో తెలీదు. అయితే 2024 ఎన్నికల మీద బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది.