Somu Veerraju - Tirupati Bypollఇప్పటివరకు అన్ని విషయాలలోను జనసేనను డామినేట్ చెయ్యడానికి ట్రై చేసిన బీజేపీకు తిరుపతి ఉపఎన్నిక సమీపిస్తున్న కొద్దీ జనసేన విలువ తెలిసినట్టుగా ఉంది. నిజంగా తెలిసిందో లేక తెలిసినట్టు నటిస్తున్నారో గానీ ఉన్నఫళంగా బీజేపీ నేతలలో జనసేన పట్ల మర్యాద పెరిగింది. తిరుపతిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలను బట్టి ఆ విషయం అర్ధం అవుతుంది.

“బీజేపీ, జనసేన మిత్రులు. మా మధ్య ఎటువంటి విబేధాలు లేవు. కొంత మంది కావాలని మా మధ్య పొరపొచ్చాలు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారికి చెప్పే చేస్తున్నాము. మేము ఏ మీటింగ్ పెట్టుకున్న పవన్ గారి అనుమతి తోటే పెట్టుకుంటున్నాం. మేము ఎం చెయ్యాలి అన్నా, పవన్ గారి అనుమతి లేనిదే చెయ్యటం లేదు,” అంటూ చెప్పుకొచ్చారు.

తిరుపతిలో జనసేన కు బలమైన సామాజిక వర్గం సప్పోర్ట్ ఉంది. ఆ సామజిక వర్గం ఓట్లు తిరుపతిలో గణనీయంగా ఉన్నాయి. ఆ ఓట్లు లేకపోతే బీజేపీ డిపాజిట్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ మార్పు అని జనసైనికులు అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తిరుపతి వచ్చి ప్రచారం చేస్తారా అనేదాని బట్టి బీజేపీ పెర్ఫార్మన్స్ ఆధారపడుతుంది.

ఇలా ఉండగా… అన్ని ప్రధాన పార్టీలు తిరుపతిలో తమ అభ్యర్థులను ప్రకటించగా ఇంకా బీజేపీ మీనమేషాలు లెక్కిస్తుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలయ్యింది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగబోతుంది. మే 2న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఇటీవలే స్థానిక ఎన్నికలలో అదరగొట్టే ఫలితాలు సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఈ సీటును సునాయాసంగా గెలుచుకుంటాం అని ధీమాగా ఉంది.