Somu Veerraju - Pawan Kalyanతమకు రాష్ట్ర బీజేపీ సరిగ్గా విలువ ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాహాటంగా విమర్శించిన తరుణంలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఆ మరుసటి రోజే…అంటే నిన్న తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికపై జనసేన-బి.జె.పి. నేతల మధ్య సుధీర్ఘంగా చర్చలు జరిపాయి.

ఈ సమావేశంలో ముఖ్యంగా ఉప ఎన్నికలో అనుసరించబోయే వ్యూహం, లోక్ సభ స్థానం పరిధిలోని జనసేన- బీజేపీ నాయకులు, శ్రేణులను సమాయత్తం చేయడం వంటి విషయాలపై దృష్టి సారించారు. అయితే ఎవరి అభ్యర్థి పోటీలో ఉండాలని అనేదాని మీద మాత్రం ఇంకా నిర్ణయం జరగలేదట. అభ్యర్ధి ఎంపికపై ఇంకో దఫా చర్చలు జరపాలని నిర్ణయించారు.

అయితే జనసైనికులు మాత్రం ఇంకా బీజేపీ ని నమ్మడానికి సిద్ధంగా లేరట. “ఈ చర్చల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఏదో జనసేనకు విలువనిస్తున్నాం అని చెప్పడానికి మాత్రమే కానిస్తున్నారు. జీహెచ్ఎంసి ఎన్నికలలో చివరినిముషంలో ఏం చేసారో అందరు చూశాం. జనసేనకు ఈ సీటు ఇస్తేనే పవన్ కళ్యాణ్ కు విలువనిచ్చినట్టు,” అని వారు అంటున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం… సమావేశంలో బీజేపీ కి సీటు వదిలేస్తేనే మంచిదని బీజేపీ పెద్దలు జనసేన ని కన్విన్స్ చెయ్యడానికే పూర్తిగా సమయం కేటాయించారట. ఎన్నికల తరువాత బీజేపీ బలం అనూహ్యంగా పెరిగిందని, జనసేన 2019లో పోటీ చెయ్యకపోవడం… ఎన్నికల పరాజయం వల్ల అక్కడ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేదని జనసేన నేతలకు చెప్పుకొచ్చారట.