Somu Veerrajuఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉండేది బీజేపీలో నైనా పార్టీ కోసం కంటే వైఎస్సార్ కాంగ్రెస్ కోసమే ఎక్కువగా పని చేస్తారు. గతంలో టీడీపీతో మిత్రపక్షంలో ఉండగా… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా పని చేసే పొత్తుని విచ్ఛిన్నం చేసుకున్నారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాకా కూడా ఆ పార్టీకి అనుకూలంగానే పని చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాల పై గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారం చెయ్యడం అవసరమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా తమ పాత్ర ఇందులో ఏమీ లేదని కేవలం కేంద్రం ఆదేశాల ప్రకారం మద్యం అమ్మకాలు మొదలు పెట్టాం అని చెబుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెంబర్ టూ అయిన విజయసాయి రెడ్డి కూడా ఇదే రకంగా వ్యాఖ్యలు చేసారు. దీనిపై బీజేపీ నాయకులు స్పందించింది లేదు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అటువంటి వ్యాఖ్యే చెయ్యగా హాజరు వేయించుకోవడానికా అన్నట్టు ఏపీ బీజేపీ నాయకుడు, సోము వీర్రాజు కేసీఆర్ ని విమర్శించారు.

“కేంద్రం చెప్పిందని మద్యం అమ్మారు సరే మరి కేంద్రం సిఏఏ, ఎన్పీఆర్,ఎన్ఆర్సీ అమలు చేయమంటుంది చేస్తావా?,” అంటూ నిలదీశారు. ఈ మాత్రం విమర్శ కూడా జగన్ మీద చెయ్యకపోవడం ఏపీ బీజేపీ పరిస్థితికి అద్దం పడుతుంది. ఇక వీరు మారే అవకాశమే లేదా అంటూ బీజేపీ అభిమానులు నిటూరుస్తున్నారు.