Somu Veerraju allegations on Chandrababu Naidu over Polavaram Projectబీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి చంద్రబాబు నాయుడు మీద మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురంలో కియా సంస్థను కేంద్రం ఏర్పాటు చేస్తే.. అది నేనే ఇచ్చానని డబ్బా కొట్టుకుంటున్నాడు.. అబద్ధాలు చెప్పడం, రాయడంలో చంద్రబాబు చిత్రగుప్తుడు అంటూ విమర్శించారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ బాబు మంగళగిరి అని పలుకలేకపోతున్నాడు.. తింగరి మంగళం లోకేష్‌ అంటూ ఎద్దేవా చేశారు.

కేంద్ర ప్రభుత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి గానీ సంక్షేమ పథకాలు అమలు గానీ జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. మోదీ వల్ల 20 రకాల అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో, పట్టణాల్లో జరిగాయని తెలిపారు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సీట్లు బట్టే రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర పాత్ర ఏంటో తెలిసిపోతుంది కదా? అదే సమయంలో సోము వీర్రాజు చెప్పినట్టు కేంద్రం రాష్ట్రానికి చాలా చేసేసి ఉంటే రాజమహేంద్రవరం సీటు ప్రకటించిన తరువాత కూడా వద్దని పోటీ నుండి ఎందుకు పారిపోయినట్టు?

లోకేష్ తింగరి మంగళమైనా ఇంకోటైనా ధైర్యంగా పోటీ చేశారు. అది కూడా తేలికగా గెలిచే సీటు కాకుండా మంగళగిరి లాంటి టఫ్ సీటు ఎంచుకున్నారు. 1985 తరువాత అక్కడ టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. లోకేష్ కు మాట్లాడటం రాకపోయినా ధైర్యంగా ముందడుగు వేశారు. మైకు దొరికితే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే సోము వీర్రాజు వంటి వారు మాత్రం ప్రత్యక్ష పోటీకి దూరమై ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయారు. ఈ వాగ్ధాటి మే 23 తరువాత ఏ మాత్రం ఉంటుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది.