Somu Veerraju comments on Chandrababu naiduబీజేపీ పెద్దల పోలవరం రాజకీయం పై చంద్రబాబు తన అసంతృప్తిని ఓపెన్ గా బయటపెట్టడంతో కమలం పార్టీ నాయకులూ ఖంగు తిన్నారు. కొందరు వెంటనే చంద్రబాబు దగ్గరకు వెళ్ళి ఆయనను శాంతపరిచే ప్రయత్నం చెయ్యగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎప్పటిలానే కేంద్రం తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేసారు.

కాకినాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తెలిపిన అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వమే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అనవసర రాజకీయాలు చేయకుండా.. ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చంద్రబాబును ఆయన కోరారు. అయితే ఇప్పుడు టెండర్లు ఆపమని చెప్పి రాజకీయం చేస్తుంది ఎవరో మరి?

కేంద్రం సహకరిస్తేనే అనే పదం సీఎం వాడటం సరికాదని.. సకాలంలోనే సహకరిస్తేనే ప్రాజెక్టు 60 శాతం పూర్తయిందన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదని ఆయన చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందే ఏపీ 5,135 కోట్లు ఖర్చు చేసింది. దాన్ని ఏపీ వాటాగా కేంద్రం పరిగణించింది.

మిగిలిన 7,431 కోట్లల్లో ఇప్పటివరకు కేంద్రం 4,329 కోట్లు ఇచ్చారు. మరో 3,102 కోట్లు రాష్ట్రం ఖర్చు పెట్టగా అది కేంద్రం నుండి రావాల్సి ఉంది. మరి ఏ రకంగా కేంద్రం సకాలంలోనే సహకరిస్తేనే ప్రాజెక్టు 60 శాతం పూర్తయిందని చెప్పగల్గుతున్నారో వీర్రాజు కే తెలియాలి. చాతగాక కేంద్రానికి వెనక్కి ఇచ్చేస్తాం అన్న సీఎం తీరు సరికాదని సోమువీర్రాజు తెలిపారు. కాకపోతే చేతైనా కేంద్రం చేయనివ్వదు అని భావన ప్రజలలో కూడా బలంగా వెళ్ళింది అని వారు తెలుసుకోలేకపోతున్నారు.