అబ్బో చాలా చెప్పారు వీర్రాజు గారు... కానీ నమ్మలేం! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చాకా కొన్ని రోజులు తెరమరుగైపోయారు. తాజాగా తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో మళ్ళీ యాక్టీవ్ అయ్యారు. తిరుపతిలో హిందుత్వ ఎజెండా మీదే బీజేపీ అన్ని ఆశలు పెట్టుకున్నట్టుగా ఉంది. ఈ క్రమంలో టీటీడీ బోర్డు మీద ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

భాజపా అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డు మెంబర్లుగా స్వామీజీలను, ప్రవచన కర్తలను, ఆధ్యాత్మిక వేత్తలనే నియమిస్తాము. హిందూ దేవాలయాలతో రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయి. రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా దేవాలయాలను నేటి ప్రభుత్వాలు మార్చేశాయి, ఇది చాలా దారుణమైన విషయము,” అని ఆయన ఆరోపించారు.

“దేవాలయాలకు సంస్కరణ కేంద్రాలుగా మన ధర్మంలో విశేష ప్రాధాన్యం ఉంది. అటువంటి దేవాలయాలను ఒక పథకం ప్రకారం కావలనే నిర్వీర్యం చేస్తున్నారు, ఈ విషయం ప్రజలు కూడా గమనిస్తున్నారు,” అన్నారు వీర్రాజు. నిజమే టీటీడీ బోర్డు అనేది రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు. అయితే ఈ విషయంలో బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిది అనేది కూడా చూడాలి కదా?

2014లో చంద్రబాబు అధికారంలో ఉన్న నాటి నుండి నేడు జగన్ ప్రభుత్వం వరకు రెండు ప్రభుత్వాలు బీజేపీ కోటాలో టీటీడీలోకి ఒకరో ఇద్దరినో తీసుకుంటూ వచ్చారు. వారు చేసిన రికమెండేషన్లు అన్నీ రాజకీయావసరాల మేరకు చేసినవిగానే ఉన్నాయి. వీర్రాజు చెప్పినట్టు స్వామీజీలను, ప్రవచన కర్తలను, ఆధ్యాత్మిక వేత్తల మాత్రం రికమెండ్ చెయ్యలేదు. దాన్నిబట్టి వీర్రాజు చెప్పేవన్నీ వట్టి మాటలే అని అనుకోవాలి.