Telugu

వైకాపా అస్మదీయులు, తస్మదీయుల డెఫినిషన్ ఆ విధంగా ఉంది

Share

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి డిపాజిట్లు దక్కించుకునే సత్తా లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండడంతో రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ పార్టీగా చలామణీ అవుతుంది. అయితే ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు ఎందుకనో మొదటి నుండీ తెలుగుదేశం పార్టీ అంటే పడదు. టీడీపీతో కలిసి పని చేసిన రోజులలో కూడా సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ కు సహాయపడే వారు.

ఆ ప్రకారం టీడీపీ.. బీజేపీ పొత్తు విచ్చిన్నం కావడంతో ప్రధాన పాత్ర పోషించారు. అధికారం మారినా ఆ పార్టీ వారు చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ కు విధేయులుగానే ఉంటున్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎప్పటిలానే తనదైన శైలిలో చంద్రబాబు మీదే విరుచుకుపడ్డారు.

“పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోని అవినీతి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయాలి,” అంటూ విమర్శించారు. కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చినా వీర్రాజు వంటి వారు అవే పాత విమర్శలు చెయ్యడం గమనార్హం.

“నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చ పార్టీ ఆందోళనకు దిగడంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కడిగి పారేశారు. బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా సైలెంటయ్యాడు. 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి ‘విజనరీ’ చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుంది,” అంటూ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

చంద్రబాబుని విమర్శిచారు కాబట్టి వీర్రాజు గారు… ఇప్పుడు తమ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ ‘డు’ అయిపోయారు. గతంలో చంద్రబాబు మీద ఎన్ని విమర్శలు చేసినా ఇప్పుడు తమ మీద విమర్శలు చేస్తే వారంతా చంద్రబాబు చీకటి మిత్రులే. మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ అస్మదీయులు, తస్మదీయుల డెఫినిషన్ ఆ విధంగా ఉంది.