వీర్రాజుగారూ అప్పుడలా... ఇప్పుడిలా? మోడీ ఎఫెక్టేనా?ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు అధ్వర్యంలో బిజెపి శ్రేణులు శనివారం రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా చేశాయి. గోదావరి నదీ జలాల కాలుష్య నివారణకి కేంద్ర ప్రభుత్వం రూ.86 కోట్లు మంజూరు చేస్తే, జగన్ ప్రభుత్వం కేవలం రూ.30 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకుండా ఆలస్యం చేస్తోందని సోమూ వీర్రాజు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇంతగా సహకరిస్తున్నా జగన్ ప్రభుత్వం దానిని వినియోగించుకోలేక చేతులు ఎత్తేస్తోందని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి ఎంతసేపు సంక్షేమ పధకాలు, అప్పులు, ప్రతిపక్షాలను వేధించడం మీద తప్ప అభివృద్ధి పనులపై ఉండదని సోమూ వీర్రాజు ఆక్షేపించారు.

ఈ సందర్భంగా ఆయన తమ మిత్రపక్షం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ‘ఒక్క ఛాన్స్’ అంటూ ప్రజలను అభ్యర్ధిస్తుండటంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు “దానిలో తప్పేముంది? టిడిపి, వైసీపీలకు ప్రజలు చెరో ఛాన్స్ ఇచ్చారు కనుక తనకీ ఒక్క ఛాన్స్ ఇమ్మనమని పవన్‌ కళ్యాణ్‌ అభ్యర్ధిస్తున్నారు. అంతే! ఆయనకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము,” అని సోమూ వీర్రాజు అన్నారు.

కొన్ని నెలల క్రితం పవన్‌ కళ్యాణ్‌ తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిని అని ప్రకటించుకొన్నప్పుడు ఇదే సోమూ వీర్రాజు తప్పు పట్టారు. బిజెపి, జనసేనలు పొత్తులు పెట్టుకొని ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే సహజంగానే జాతీయపార్టీ అయిన బిజెపికే ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది తప్ప ప్రాంతీయ పార్టీకి కాదు. అయినా దీని గురించి మా అధిష్టానం ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొంటుంది,” అని అన్నారు.

సోమూ వీర్రాజులో ఈ మార్పు ప్రధాని నరేంద్రమోడీ క్లాసు పీకడం వలననే వచ్చిందని అర్దం అవుతూనే ఉంది. ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన తర్వాత నుంచే పవన్‌ కళ్యాణ్‌ తనకు ఒక ఛాన్స్ ఇమ్మనమని, నేను ముఖ్యమంత్రి అయితే ఫలానా ఫలానా ఫైల్స్ పై తొలి సంతకాలు చేస్తానని చెపుతున్నారు. దానిని సోమూ వీర్రాజు కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నారు. అంటే జనసేన ముందుండి సాగుతుంటే వెనుక నుంచి రాష్ట్ర బిజెపి అన్ని విదాల సహకరించాలని ఒప్పందం జరిగినట్లు కనిపిస్తోంది.

మంచిదే! కానీ ముందు బిజెపి, జనసేనల మద్య పొత్తులపై పవన్‌ కళ్యాణ్‌ కూడా స్పష్ఠత ఇస్తే బాగుంటుంది. ఇటువంటి అయోమయ పరిస్థితిని ఎక్కువకాలం కొనసాగించడం వలన పార్టీ క్యాడర్ గందరగోళానికి గురయితే దాని వలన జనసేన పార్టీయే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.