Somu Veerraju 13 districts 13 capitals (1)ఇటీవలే బీజేపీకి అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు రెట్టించిన ఉత్సాహంతో టీవీ స్టూడియోలకు తిరిగి తమ పార్టీ వాణిని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న మూడు రాజధానుల చర్చ సందర్భంగా… సోము వీర్రాజు మూడు రాజధానులు కాదు తమ పార్టీకి అవకాశం ఉంటే పదమూడు జిల్లాలనూ రాజధానులుగా చేసేస్తాం అని చెప్పుకొచ్చారు.

“బీజేపీకి పవర్ ఇప్పించేస్తే… ప్రజలను సమైక్యంగా చేసి పడేస్తాం… పదమూడు జిల్లాలను కాపిటల్ గా చేసేస్తాం… ప్రతీ జిల్లాను రాజధానిగా చేసి పడేస్తాం… అద్భుతంగా చేస్తాం… సంతోషంగా ఉంటారు ప్రజలు,” ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే దీని పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలుతున్నాయి.

అయితే ఇదేదో అనుకోకుండా లేక నోరు జారి అన్న మాటగా అనిపించడం లేదు. ఇప్పటికే సోము వీర్రాజు ఇదే రకమైన వ్యాఖ్యలు రెండు సార్లు చేశారు. దానితో ఇది జనసేన, బీజేపీ కొత్త ఎన్నికల ఎజెండానా? అనే అనుమానం అందరిలోనూ బయల్దేరింది. రాజకీయ నాయకులు, పార్టీలు ప్రజలకు చిత్రమైన ఎన్నికల వాగ్దానాలు చెయ్యడం కొత్తేమీ కాదు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ భాగ్యరేఖలు మార్చేస్తారు అనుకున్న సోము వీర్రాజు ఇటువంటి వ్యాఖ్యలు చేసి అభాసుపాలు కావడం బీజేపీ అభిమానులు ఇబ్బంది పడుతున్నారు. అయితే అంతకంటే వీర్రాజు నుండి ఏం ఆశించారు అంటూ ప్రత్యర్ధులు వారిని గేలి చెయ్యడం సోషల్ మీడియాలో కనిపిస్తుంది.