Somu Veerrajuరెండు రోజుల క్రితం బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉన్నఫళంగా అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. ఏడాదిపాటు సాగుతున్న ఉద్యమంపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం మాటతప్పింది అని వైసీపీని ప్రశ్నించారు వీర్రాజు. రైతులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మోడీ మాటగానే ఇది చెపుతున్నా అని చెప్పుకొచ్చారు.

అయితే ఈ మాట మార్చుకోవడానికి రాజకీయ కారణం ఉందనే అంటున్నారు విశ్లేషకులు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ పోటీ చెయ్యనున్న సంగతి తెలిసిందే. అక్కడ మెజారిటీ ప్రజలు అమరావతి రాజధానిగా ఉండటానికే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అందుకే ఉన్నఫళంగా సోము వీర్రాజు అమరావతిలో వాలిపోయారు.

తిరుపతికి అమరావతి దగ్గర…. అదే సమయంలో విశాఖపట్నం అంటే చాలా దూరం. అందుకే అక్కడి ప్రజలు అమరావతినే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారట. బీజేపీ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం తేలడంతో సోము వీర్రాజు తమ అభిప్రాయం మార్చుకున్నట్టుగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు.

ఇక్కడ కొసమెరుపు ఏంటంటే… రాజధానిలో మహిళా రైతులపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి అప్పట్లో చేసిన కామెంట్స్‌ దూమారం రేపాయి. ఖరీదైన చీరలు కట్టుకున్న మహిళల ఉద్యమం అంటూ విష్ణువర్థన్ రెడ్డి గతంలో అనడంతో ఇంటా బయటా అభ్యంతరాలు వచ్చాయి. జనసేన కూడా తప్పు పట్టింది. ఇప్పుడు ఏకంగా వీర్రాజే అమరావతి రైతుల దగ్గరకు వెళ్లారు.