Somireddy Chandramohan Reddyనిన్న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తుండగా మంత్రి ఆదిమూలపు సురేష్ తన అనుచరులను ఉసిగొల్పి రాళ్ళదాడి చేయించడం వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అని టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. భాద్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న ఆదిమూలపు సురేష్ నడిరోడ్డు మీద చొక్కా విప్పేసి రౌడీలా ప్రవర్తించారని, ఓ మాజీ ముఖ్యమంత్రి మీద తన అనుచరులతో రాళ్ళ దాడి చేయించారని ఇది చాలా దారుణమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆదిమూలపు సురేష్ నడిరోడ్డుపై చొక్కా విప్పేసి తన పరువు తీసుకోవడంతో పాటు వైసీపీ ప్రభుత్వం పరువు కూడా తీసేశారని అన్నారు.

వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని, అందుకే వినాశకాలే విపరీతబుద్ది అన్నట్లు ఆ పార్టీలో అందరూ ఈవిదంగా వ్యవహరిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీలో ఒకరు ఫ్యాంట్ ఇప్పేస్తారని, మరొకరు చొక్కా విప్పేస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రదాన ప్రతిపక్ష నాయకుడికే భద్రత లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఏముంటుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోగా అప్పులపాలు చేసి ముంచేస్తూ, రాష్ట్రంలో ఆరాచక వాతావరణం సృష్టిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఓ యూపీ, బీహార్ రాష్ట్రాలాలగా మార్చేస్తోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ కార్యకర్తల దాడిలో చంద్రబాబు నాయుడు కమెండో గాయపడటంతో టిడిపి తరపున హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మినారాయణ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌ భల్లాకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ దాడికి సంబందించిన వీడియోలను కూడా పంపించిన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు లేదా టిడిపి ముఖ్యనేతలు ఏపీ గవర్నర్‌ని కలిసి వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు.

ఇప్పటికే వివేకా హత్యకేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ పీకల్లోతు ఇరుక్కుపోయి బయటపడలేక అవస్థలు పడుతోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎస్.అబ్దుల్ నజీర్ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని భావించిన్నట్లయితే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసినా ఆశ్చర్యం లేదు.