somireddy chandramohan reddy fires on jaganఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయిదున్నర్ర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అప్పట్లోనే అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకుంటున్నారని, వైఎస్ చేసిన పాదయాత్ర వలన ఎక్కడ ఏ ఏ స్థలాలు ఖాళీగా ఉన్నాయో తెలుసుకుని మరీ ఆక్రమించుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం… ఆ తర్వాత వైఎస్ మరణం… జగన్ పై కేసులు తదితర డ్రామా ఎపిసోడ్ లన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో విజయవంతంగా నడిచిన విషయం రాజకీయ విజ్ఞులకు విదితమే.

అయితే వైఎస్ అధికారంలో ఉండి చేసిన తప్పులతో వ్యక్తిగతంగా చేసిన తప్పుల గురించి ప్రస్తుతం టిడిపి నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. “వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అతిపెద్ద తప్పుల్లో తన కొడుకు జగన్ ను సరిగా పెంచకపోవడం కూడా ఒకటని” టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేసుల విచారణ పూర్తయితే ప్రజలు ఎవరిని కొడతారో తెలుస్తుందని, జగన్ పతనం ఇక ఆరంభమైందంటూ విరుచుకుపడ్డారు.

13 అవినీతి కేసుల్లో జగన్ ‘ఏ1’ ముద్దాయిగా ఉన్నారని, కేసుల విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా సోమిరెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోమిరెడ్డి ధ్వజమెత్తిన విధానం ఇది. ‘అనడం ఎందులకు… అనిపించుకోవడం ఎందులకు…’ అన్న రీతిలో రాజకీయ విశ్లేషకులు కూడా జగన్ వ్యాఖ్యలను విశ్లేషిస్తున్నారు.