Somireddy Chandra Mohan Reddy-fires on chiranjeeviజనసేన పార్టీ అమరావతికి పూర్తి స్థాయిలో మద్దతు తెలపగా చిరంజీవి జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్ధించడం ఆ పార్టీని షాక్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ట్విట్టర్ వేదికగా ఆయన చిరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. అప్పుడేమో ప్రజలకోసమని ప్రజారాజ్యం పెట్టి.. దాన్ని మరో పార్టీలో కలిపేశారని చిరును విమర్శించారు. మంత్రి పదవి పొంది విభజన పాపంలో భాగమయ్యారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తమ్ముడు జనం కోసం పోరాడుతుంటే… భుజం తట్టక, మరో రాగమెత్తుకున్నారన్నారు.

అయినా తెలంగాణలో వ్యాపారాలు, సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏపీ జనం కష్టాలు ఏం తెలుస్తాయిలే అన్నారు. మళ్లీ దూకేస్తాడేమో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చిరంజీవి మీద ఫైర్ అవుతూనే పవన్ కళ్యాణ్ మీద జాలి చూపించడం ఇక్కడ విశేషం. బహుశా ఇది పవన్ కళ్యాణ్ కు దగ్గరయ్యే ప్రయత్నం అనుకోవాలేమో?

ఇది ఇలా ఉండగా చిరంజీవి పత్రికా ప్రకటనపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గానీ జనసేన పార్టీ ప్రముఖులు గానీ స్పందించలేదు. మరోవైపు అమరావతి పై జీఎన్ రావు కమిటి ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించాకే జనసేన తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తుందని జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది.