Somireddy-Chandra-Mohan-Reddyఏపీ సీఐడీ పోలీసులు మొన్న శనివారం హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లో ఉంటున్న టిడిపి నేత చింతకాయల విజయ్ ఇంట్లోకి ప్రవేశించి పనివారిపై దౌర్జన్యం చేయడాన్ని టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “చింతకాయల అయ్యన్నపాత్రుడు రాష్ట్రంలో సీనియర్ రాజకీయనాయకుడు. ఆయన కుమారుడు విజయ్ ఇంట్లోకి ఏపీ సీఐడీ పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించి, పనివారిపై దౌర్జన్యం చేయడం, డ్రైవరును కొట్టడాన్ని, చిన్న పిల్లలని ప్రశ్నించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం పోలీసులు చిన్న పిల్లలని ప్రశ్నించడానికి వీల్లేదని ఏపీ సీఐడీ పోలీసులకు తెలియదా?కనీసం తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా చింతకాయల విజయ్ దంపతులు ఇంట్లో లేని సమయంలో వారి ఇంట్లోకి ఎందుకు ప్రవేశించారు?ఎందుకు సోదాలు చేశారు? ఆయన ఏమైనా టెర్రరిస్టా? నక్సలైటా?

ఇంతకీ విజయ్ చేసిన తప్పేమిటి?సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే నేరమా? శాసనసభలో మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు చండాలంగా మాట్లాడుతుంటే తప్పు లేదు కానీ విజయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే తప్పా?ఒకవేళ ఆయన చేసింది తప్పని భావిస్తే పోలీసులు నోటీసులు ఇచ్చి వెళ్లిపోవాలి కానీ ఇంట్లో దూరి దౌర్జన్యం చేయడం ఏమిటి? పొరుగు రాష్ట్రంలో కూడా ఏపీ పోలీసులు చేస్తున్న ఈ దౌర్జన్యాలు చూస్తూనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను.

అక్కడ స్థానిక ప్రజలు ఏపీ సీఐడీ పోలీసులను గట్టిగా నిలదీస్తే వారిపై కూడా తిరగబడి కేసులు పెడతామని బెదిరించారు. ఏపీ సీఐడీ పోలీసుల తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. చింతకాయల విజయ్ ఇంట్లో ప్రవేశించి దౌర్జన్యం చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను,” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.