టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై తీవ్రస్థాయిలో మండి పడ్డారు.
నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నెల్లూరు జిల్లాలో మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డితో సహా వైసీపీ నేతలందరూ దొరికినకాడికి దోచేసుకొంటున్నారు. ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రావెల్ మాఫియా, సిలికా శాండ్ మైనింగ్ చేస్తూ ఈ 3-4 ఏళ్లలోనే రూ.3,000 కోట్లు దోచేశారు. ఆనాడు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి నుంచి నేటి వరకు ఎంతోమందిని చూశాము కానీ ఇంత విచ్చల విడిగా దోపిడీకి పాల్పడటం ఎన్నడూ చూడలేదు.
కొందరైతే కర్నూలు జిల్లాలో అనమూతులు తీసుకొని నెల్లూరులో తవ్వేసుకొంటున్నారు. నెల్లూరు సముద్ర తీరంలో సాగరమాల ప్రాజెక్టు కోసం 2.50 మీటర్లకు మాత్రమే అనుమతి ఉండగా 5,6 మీటర్ల వరకు తవ్వేసి సిలికా శాండ్ మైనింగ్ చేస్తున్నారు. మొన్న నేను మీడియా సమావేశంలో కొందరు అధికారులు అక్రమ సంపాదన కోసం వైసీపీ నేతలతో చేతులు కలిపి వారి అక్రమాలకు అండగా నిలబడుతున్నారని అంటే, ఉద్యోగులందరినీ నేను అవినీతిపరులని అన్నానంటూ నాపైకి రెచ్చగొడుతున్నారు.
ఇదివరకు నేను జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు వైసీపీ నేతల అక్రమ దందాల గురించి చెప్పినదానికి రెండు మూడు రెట్లు ఎక్కువే అక్రమాలు జరుగుతున్నాయని, కాసులకు ఆశపడిన కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని సాక్షి పత్రికలోనే కధనాలు ప్రచురించింది. ఇవిగో మీ పత్రికలో వచ్చిన వార్తలు అంటూ సోమిరెడ్డి ఆ పత్రిక జిరాక్స్ కాపీలను మీడియా ప్రతినిధులకు చూపారు.
మీ వైసీపీ నేతల అవినీతి గురించి మీ వైసీపీ పత్రికలోనే స్పష్టంగా చెపుతోంది కదా?మరి దీనికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏమంటారు? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
“నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ వేలకోట్ల దోపిడీలపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తక్షణం కలుగజేసుకొని సీబీఐ, ఈడీలతో విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వాటితో పాటు వైసీపీ నేతల ఈ అక్రమార్జనలపై ఫెమా ఉల్లంఘనల కింద విచారణ చేపట్టాలని కోరుతున్నాను,” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.